Ajit Pawar: స్పీకర్ విషయంలో ఆ తప్పు చేయకుండా ఉండుంటే.. కథ వేరుగా ఉండేదన్న అజిత్ పవార్

MLAs Disqualification Issue Could Have Been Resolved says Ajit Pawar
  • 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు 
  • నాటి స్పీకర్ పటోలే.. సీఎం ఉద్ధవ్ థాకరేని సంప్రదించకుండానే రాజీనామా చేశారని విమర్శ
  • వెంటనే స్పీకర్ నియామకంపై కూటమి దృష్టిపెట్టాల్సిందని వెల్లడి
  • అదే జరిగి ఉంటే 16 మందిపై అనర్హత వేటు పడేదన్న ఎన్సీపీ నేత
  • షిండే సీఎం కాగానే స్పీకర్ పదవిని భర్తీ చేసి, అంతా తన చేతుల్లోకి తీసుకున్నారని వ్యాఖ్య
శివసేనపై తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నానా పటోలే రాజీనామా చేసిన తర్వాత మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి వేగంగా స్పందించి ఉంటే.. ఆ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేదని చెప్పారు. కూటమికి చెందిన వ్యక్తి స్పీకర్ గా ఉండి ఉంటే.. తమకు అనుకూలంగా వ్యవహరించేందుకు అవకాశం ఉండేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు. 

శుక్రవారం పూణెలో మీడియాతో అజిత్ పవార్ మాట్లాడుతూ, ‘‘అప్పటి అసెంబ్లీ స్పీకర్ (పటోలే).. ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ థాకరేని సంప్రదించకుండానే రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రకటన చేశారు. ఇలా జరగాల్సింది కాదు.. కానీ జరిగింది’’ అని పవార్ అన్నారు.

పటోలే రాజీనామా తర్వాత (2021 ఫిబ్రవరిలో) ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ కూటమి.. స్పీకర్ నియామకంపై దృష్టిపెట్టాల్సిందని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎంవీఏ కూటమి ఆ పని చేయలేకపోయిందని చెప్పారు. 

“ఈ సంఘటన (షిండే వర్గం తిరుగుబాటు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు) తర్వాత.. వారు వెంటనే స్పీకర్ పదవిని భర్తీ చేశారు. నాడు స్పీకర్ ఉండి ఉంటే, ఎంవీఏ కూటమి ముందుగానే స్పీకర్ పదవిని భర్తీ చేసి ఉంటే.. షిండే వర్గం తిరుగుబాటుతో రేగిన అనర్హత సమస్య పరిష్కారమయ్యేది. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేది’’ అని అభిప్రాయపడ్డారు. బీజేపీ సపోర్ట్ తో షిండే సీఎం కాగానే స్పీకర్ పదవిని భర్తీ చేసి, అంతా తన చేతుల్లోకి తీసుకున్నారని పరోక్షంగా చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని ఉద్ధవ్ థాకరే చేసిన డిమాండ్‌పై అజిత్ పవార్ స్పందించారు. ‘‘ఆ డిమాండ్ వల్ల ప్రయోజనం ఉండదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, ప్రస్తుత వ్యక్తులకు మధ్య చాలా తేడా ఉంది. ఇప్పుడున్న వారు ఎప్పటికీ రాజీనామా చేయరు. కనీసం కలలో కూడా ఆ పని చేయరు’’ అని వ్యాఖ్యానించారు.
Ajit Pawar
MLAs Disqualification
Shiv Sena
Eknath Shinde
Uddhav Thackeray
BJP
Congress
NCP

More Telugu News