Pawan Kalyan: ఎమ్మెల్యేగా గెలవని నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా?: పవన్ కల్యాణ్

Pawan Kalyan on chief minister post

  • టీడీపీ నేతలను సీఎం చేసేందుకు జనసేన లేదని చెప్పిన పవన్ కల్యాణ్
  • మన బలాన్ని మనం బేరీజు వేసుకోవాలన్న పవన్
  • మీరు ఓటు వేయకుండా నేను ముఖ్యమంత్రి అంటే ఎలా అని ప్రశ్న
  • రాజకీయాల్లో వ్యూహాలు మాత్రమే ఉంటాయి.. బేషజాలు కావన్న జనసేనాని
  • ప్రజల కోసం ఎన్ని తిట్లు తినేందుకైనా సిద్ధమని వ్యాఖ్య
  • చంద్రబాబు మోసం చేయడానికి నేనేమైనా చిన్నపిల్లాడినా అన్న పవన్

పదిహేను నిమిషాల సమయం ఇస్తే మా ప్రతాపం చూపిస్తామన్న మజ్లిస్ వారిని ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారని, కానీ జనసేనకు ఇంత జనాదరణ ఉన్నప్పటికీ మనం ఎందుకు గెలవడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి సభలో అన్నారు. ఆయన ఇక్కడ జరిగిన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు. కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే పవన్ కల్యాణ్ చాలామందికి గుర్తుకు వస్తాడని, ఎన్నికల సమయంలో మాత్రం గుర్తుకు రావడం లేదన్నారు. 

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు చెప్పుకోవడం లేదంటే..

తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకోకపోవడంపై చాలామంది తనను ప్రశ్నిస్తుంటారని, కానీ మజ్లిస్ పార్టీలా ఏడు స్థానాల్లో కూడా తనను గెలిపించలేదని, అలాంటప్పుడు ఎలా చెప్పగలనని ప్రశ్నించారు. కనీసం విజయ్ కాంత్ లా తనను గెలిపించలేదన్నారు. 2009లో వచ్చిన 18 సీట్లను ఇవ్వలేదని, అలాంటప్పుడు ఎలా చెప్పుకుంటామన్నారు. తాను పరాభవాన్ని కూడా స్వీకరించే వ్యక్తిని అన్నారు. అందుకే ఉన్న విషయం మాట్లాడుతున్నట్లు చెప్పారు. మన బలాన్ని మనం బేరీజు వేసుకోవాలన్నారు. మనం అవసరమైనప్పుడు తగ్గడమే కాదు, సమయానికి బెబ్బులిలా తిరగబడేలా ఉండాలన్నారు.

టీడీపీ నేతలను ముఖ్యమంత్రిగా చేయడానికి నేను లేను

టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చేయడానికి తాను లేనని చెప్పారు. కానీ మన బలాన్ని మనం బేరీజు వేసుకోవాలన్నారు. తనకు ఎక్కువ సీట్లు వస్తాయనుకుంటే పొత్తు గురించి ఎందుకు మాట్లాడుతానని చెప్పారు. అలాగే మరో పార్టీ నాయకుడు తనను సీఎంగా చేయాలని ఎందుకు అనుకుంటాడని టీడీపీని ఉద్దేశించి అన్నారు. కనీసం 40 సీట్ల నుండి 50 సీట్లు గతంలో వచ్చి ఉంటే ముఖ్యమంత్రిని అయ్యేవాడినని చెప్పారు. ప్రజలుగా ఉన్న మీరు ఓటు వేయకుండా మనం ముఖ్యమంత్రి పదవిపై ఎలా మాట్లాడుతామన్నారు. 

ఎమ్మెల్యేగా గెలవలేదు.. ముఖ్యమంత్రి పదవి ఇస్తారా?

అలయెన్స్ ను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయవద్దని పవన్ పార్టీ కేడర్ కు సూచించారు. అలయెన్స్ అంటే పార్టీ బలం పెరగడానికి దోహదపడుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదిగిందో గుర్తించాలన్నారు. మనకు ఎమ్మెల్యే పదవే లేదని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీఎం పదవి కోసం డిమాండ్ చేయాలని కొంతమంది తనకు సూచిస్తున్నారని, కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం లేదన్నారు. రాజకీయాల్లో వ్యూహాలు మాత్రమే ఉంటాయని, బేషజాలు ఉండవన్నారు. తాను డివిజన్ స్థాయి నేతగా, మండలస్థాయి నేతగా ఉండాలని జనసేన కేడర్ కోరుకుంటున్నట్లుగా ఉందని, అలాంటప్పుడు మరో పార్టీ నాయకులు తనను ముఖ్యమంత్రిగా చేస్తారా అన్నారు.

తిట్లు తినేందుకు నేను సిద్ధం

తాను షూటింగ్ చేసుకుంటే రెండు నుండి మూడు కోట్ల సంపాదన అని పవన్ అన్నారు. కానీ తాను అందరితో తిట్లు తింటూ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో తెలుసుకోవాలని హితవు పలికారు. మార్పు రావాల్సింది నాయకుల్లో కాదని, ప్రజల్లో అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను తిట్లు తినేందుకు, సిద్ధమని, కానీ ప్రజలు అండగా ఉండాలన్నారు. బీమ్లా నాయక్ సినిమాను అడ్డుకోవడం వల్ల రూ.30 కోట్ల నష్టం వచ్చిందన్నారు. వైసీపీకి జనసేన అంటే భయంగా ఉందన్నారు. నేను మాట్లాడుతుంటే వైసీపీ బుడతలు వచ్చి మాట్లాడుతుంటారని మండిపడ్డారు. నా రాష్ట్రం కోసం.. నా ప్రజల కోసం నా కుటుంబాన్ని, చిన్న పిల్లల్ని తిట్టినా పడ్డానని చెప్పారు. తాను సీఎం కావాలంటే మనకు మొదట మంచి సీట్లు రావాలన్నారు. భావోద్వేగాలతో కాకుండా ఆలోచనతో రాజకీయం చేద్దామన్నారు.

చంద్రబాబు మోసం చేస్తే.. నేనేం చిన్నపిల్లాడినా..

చంద్రబాబు తనను మోసం చేస్తే ఊరుకోవడానికి తానేం గడ్డం కూడా రాని చిన్న పిల్లవాడినా? అని ప్రశ్నించారు. ఎలాంటి వ్యూహం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చానా అని ప్రశ్నించారు. కొంతమంది కాపు నేతలు అన్ని విషయాల్లో కులం అంటారని, కానీ రాజకీయం దగ్గరకు వచ్చేసరికి కులం అంటారేమిటని ప్రశ్నించారు. కులాల్ని వదులుకోమని తాను చెప్పడం లేదని, ఎవరి ఉనికిని వారు కాపాడుకోవాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడితే తాను స్పందించడానికి అర్థం ఉందన్నారు. పద్నాలుగేళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు కుటుంబాన్నే అన్నారంటే మనల్ని అనరని గ్యారెంటీ ఏమిటన్నారు. మహిళల జోలికి వెళ్లడం జనసేన నైజం కాదన్నారు.

జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీ కోలుకోదు


తాను తప్పు ఎక్కడ ఉంటే అక్కడ తాట తీసి ప్రశ్నిస్తానని చెప్పారు. తప్పును నిలదీసే గుండెధైర్యం లేకుంటే రాజకీయాల్లోకి రావొద్దని చెప్పారు. నేను నమ్ముకున్న నా రాష్ట్రాన్ని ఏమైనా అంటే తాట తీస్తానని చెప్పారు. జగన్ ఏ మతానికి, ఏ కులానికి న్యాయం చేయలేదన్నారు. ఎస్సీలకు అంబేద్కర్ స్కాలర్ షిప్స్ తీసేశారని ఆరోపించారు. వైసీపీని అధికారం నుండి తప్పించాలని చెప్పారు. వైసీపీ అడ్డగోలుగా సంపాదించిందని, ఆ డబ్బుతో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే కనుక, ఆంధ్రప్రదేశ్ మళ్లీ జీవితంలో కోలుకోలేదన్నారు.

  • Loading...

More Telugu News