Suryakumar Yadav: ఐపీఎల్ లో వీర శతక 'సూర్య' తేజం
- ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ × ముంబయి ఇండియన్స్
- చిరస్మరణీయ సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్
- 49 బంతుల్లో 103 నాటౌట్
- 11 ఫోర్లు, 6 సిక్సులు బాదిన సూర్య
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసిన ముంబయి
ముంబయిలోని వాంఖెడే మైదానం నేడు సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ విన్యాసాలకు మైమరచిపోయింది. షాట్ కొడితే... బంతి కాంతులు విరజిమ్మే తారాజువ్వలా దూసుకుంటూ వెళ్లి బౌండరీ దాటడం, ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో గంతులేయడం... ఇలా ఎన్ని సార్లు జరిగిందో!
తనకు మాత్రమే సాధ్యమైన షాట్లను 360 డిగ్రీల కోణంలో సూర్యా కొడుతుంటే రాత్రివేళ సైతం ముంబయి 'స్కై' మెరిసిపోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా లెక్కచేయకుండా, తెగువతో అతడు ఆడిన షాట్లతో ఓ ఆధునిక తరం క్రికెట్ కోచింగ్ పుస్తకం తయారుచేయవచ్చు. ఇవాళ గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో సూర్యా ఆడిన తీరుకు ఇంకా ఎన్నో ఉపమానాలు చెప్పుకోవచ్చు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్... ముంబయికి బ్యాటింగ్ అప్పగించింది. సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో ముంబయి జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్య 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇన్నింగ్స్ చివరి బంతికి ముందు సూర్య వ్యక్తిగత స్కోరు 97 పరుగులు కాగా... ఓ సిక్స్ తో సెంచరీ అందుకున్న తీరు "వాహ్ సూర్యా వాహ్" అనిపించింది. ఐపీఎల్ లో సూర్యకుమార్ ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
ఇక ముంబయి ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ 31, కెప్టెన్ రోహిత్ శర్మ 29, నేహాల్ వధేరా 15, విష్ణు వినోద్ 30 పరుగులు చేశారు. టిమ్ డేవిడ్ (5) విఫలమయ్యాడు.
ఓ దశలో రషీద్ ఖాన్ వెంటవెంటనే వికెట్లు తీసినా... సూర్య సాహసోపేత బ్యాటింగ్ తో ముంబయి ఇండియన్స్ స్కోరు బోర్డును జెట్ స్పీడ్ తో పరుగులు తీయించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ కు 4, మోహిత్ శర్మకు 1 వికెట్ తీశారు.