Kondagattu: ప్రారంభమైన హనుమాన్ జయంత్యుత్సవాలు.. కాషాయమయంగా కొండగట్టు!
- రేపటి వరకు కొనసాగనున్న ఉత్సవాలు
- ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్
- భక్తులతో కిక్కిరిసిపోతున్న కొండగట్టు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటి వరకు జరుగుతాయి. తొలుత స్వామివారికి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పండ్లు, పూలతో అలంకరించారు.
అంతకుముందు ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం తరపున ఈవో రమాదేవి, హైదరాబాద్లోని గణేశ్ ఆలయ చైర్మన్ జయరాజ్ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్రం నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరీ ముఖ్యంగా హనుమాన్ దీక్షధారులతో అంజన్న ఆలయ పరిసరాలు కాషాయ వర్ణాన్ని సంతరించుకున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.