Karnataka: మేనిఫెస్టోలోని 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తామన్న రాహుల్.. ఆ 5 హామీలు ఇవే!
- కర్ణాటకలో ఘన విజయం దిశగా కాంగ్రెస్
- గ్యారెంటీ కార్డ్ పేరుతో ఐదు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
- ముఖ్యంగా మహిళలపై వరాల జల్లు
కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పునర్వైభవాన్ని సాధించింది. బీజేపీకి అందనంత మెజార్టీతో దూసుకుపోతోంది. 224 స్థానాలకు గాను దాదాపు 137 స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. మరోవైపు, ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు హామీలతో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రకటించింది. కాసేపటి క్రితం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తొలి రోజునే ఐదు హామీలను నెరవేరుస్తామని చెప్పారు.
కర్ణాటక మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు ఇవే:
- గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- గృహలక్ష్మి పథకం కింద 1.5 కోట్ల గృహిణులకు నెలకు రూ. 2 వేల ఆర్థిక సహాయం
- అన్న భాగ్య పథకం కింద పేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం
- యువనిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3 వేలు, డిప్లొమా చదివిన వారికి నెలకు రూ. 1,500 నిరుద్యోగభృతి
- ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.