Nara Lokesh: నన్ను అడ్డుకోవడానికి ఏ1 వద్ద ఉన్న అస్త్రాలన్నీ అయిపోయాయి: నారా లోకేశ్
- శ్రీశైలంలో నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- ఆత్మకూరు సభలో ప్రసంగం
- ఈ నాలుగేళ్లలో ప్రిజనరీ పీకిందేమీ లేదని వ్యంగ్యం
- గొడవ చేయడానికి వైసీపీ కుక్కలను పంపుతున్నారని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగించారు. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలని మొదట ఆలోచన చేసింది ఎన్టీఆర్ అని వెల్లడించారు. తెలుగుగంగ ప్రాజెక్టు, వెలుగోడు జలాశయం నిర్మించి సీమను సస్యశ్యామలం చేశారని కీర్తించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లతో ప్రిజనరీ పీకిందేమీ లేదే, ఇక పీకబోయేదీ ఏమీ లేదు అని విమర్శించారు. ఏ1 జగన్ తెచ్చిన జీవో నెం.1 చెల్లదని, మడిచిపెట్టుకోవాలని ఆనాడే చెప్పానని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. జీవో నెం.1 పోయిందని, వచ్చే ఎన్నికల్లో ఏ1 జెండా పీకేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాజ్యాంగమే గెలిచిందని, రాజారెడ్డి రాజ్యాంగం చెత్తబుట్టలో పడిందని అన్నారు.
"నన్ను అడ్డుకోవడానికి ఏ1 వద్ద ఉన్న అన్ని అస్త్రాలు అయిపోయాయి. గొడవ చేయడానికి వైసీపీ కుక్కలను పంపుతున్నారు. ఈ సైకో జగన్ పనైపోయింది... ఈ చీటింగ్ చక్రపాణి (స్థానిక ఎమ్మెల్యే) పనైపోయింది. రేపు వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మా కార్యకర్తలను మీరు ఇబ్బంది పెట్టారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను ఈ లోకేశ్ తీసుకుంటాడు" అని హెచ్చరించారు. ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రన్న మన రాముడు... కానీ ఈ లోకేశ్ వైసీపీ వాళ్ల పాలిట రాక్షసుడు అని పేర్కొన్నారు.