no ball Row: నో బాల్ వివాదం... చేతికందిన వస్తువులు విసిరిన ఫ్యాన్స్... హైదరాబాద్ స్టేడియంలో ఘటన
- లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య నో బాల్ వివాదం
- నడుము కంటే పైనుంచి వెళ్లినా.. నో బాల్ కాదన్న థర్డ్ అంపైర్
- తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఫ్యాన్స్..
- ఫ్యాన్స్ దురుసుతనంతో మ్యాచ్‌కు అంతరాయం
- ఫీల్డింగ్ చేస్తున్న ప్రేరక్ మన్కడ్ తలకు ఓ వస్తువు తగిలిందన్న జాంటీ రోడ్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తరచూ ‘నో బాల్’ వివాదాలు చెలరేగుతున్నాయి. నడుము కంటే ఎత్తులో వచ్చే బంతుల విషయంలో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. నో బాల్ నిర్ణయంపై డీఆర్‌ఎస్ కోరే అవకాశం ఉండడం కూడా కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది.
నిన్న లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నో బాల్ వివాదం మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగించింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ వేసిన మూడో బంతి హై ఫుల్ టాస్‌గా వెళ్లింది. ఆ బంతి బ్యాట్స్‌మన్ నడుము కంటే పై భాగం నుంచి వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్లు నో బాల్ అని ప్రకటించారు.
ఆ నిర్ణయాన్ని లక్నో టీమ్ చాలెంజ్ చేసింది. ఆ బాల్ హై ఫుల్ టాస్ అయినప్పటికీ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలింది కాబట్టి అది నో బాల్ కాదని థర్డ్ అంపైర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై హైదరాబాద్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. థర్డ్ అంపైర్‌ను తిడుతూ హైదరాబాద్ డగౌట్ వైపు చేతికందిన వస్తువులు (Nuts and Bolts) విసిరారు. దీంతో మ్యాచ్‌కు కాస్త అంతరాయం ఏర్పడింది.
అభిమానులు విసిరిన ఓ వస్తువు.. తమ జట్టు ప్లేయర్ ప్రేరక్ మన్కడ్ కు తగిలిందని లక్నో ఫీల్డిండ్ కోచ్ జాంటీ రోడ్స్ తెలిపాడు. లక్నో డగౌట్ వద్దకు చేతికందిన వస్తువులు (Nuts and Bolts) విసిరారంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ పై రోడ్స్ స్పందించాడు. ‘‘డగౌట్ వద్ద కాదు.. ఆటగాళ్లపైకి విసిరారు. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రేరక్ మన్కడ్ తలపై కొట్టారు’’ అని పేర్కొన్నారు. మరోవైపు థర్డ్ అంపైర్ నిర్ణయంపై టామ్ మూడీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలాంటి తప్పుడు నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.