Siddaramaiah: కన్నడ సీఎం రేసు.. కాంగ్రెస్ లో పోటాపోటీ పోస్టర్లు!

banners and posters were displayed in many places in support of siddaramaiah and dk shivakumar
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్
  • సీఎం ఎవరనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్
  • రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్
  • తమ నేతకు మద్దతుగా పోస్టర్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. హంగ్ అనే మాటకే తావు లేకుండా మెజారిటీ కన్నా 20 సీట్లు ఎక్కువే కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుంది? సిద్ధరామయ్యకా? లేక డీకే శివకుమార్ కా? అనేది ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ.. తమ ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులో జరిగే సమావేశంలో శాసన సభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఎవరనేది కూడా తేలే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో కర్ణాటకలో పోటాపోటీగా పోస్టర్లు వెలిశాయి. బెంగళూరులో సిద్ధరామయ్య, శివకుమార్ నివాసాల దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని, కాబోయే సీఎం డీకే శివకుమార్ కు శుభాకాంక్షలంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లను ఆయా నేతల మద్దతుదారులు ఏర్పాటు చేశారు.

ఈ పోస్టర్ల వ్యవహారంపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామలింగారెడ్డి స్పందించారు. ‘‘ప్రతి ఒక్కరికీ కోరికలు, ఆశయాలు ఉంటాయి. డీకే శివకుమార్‌, సిద్ధరామయ్యకే కాకుండా ఎంబీ పాటిల్‌, జీ పరమేశ్వరకు కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది. ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్‌ నిర్ణయిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.
Siddaramaiah
DK Shivakumar
Congress
Karnataka
Karnataka Assembly Elections
CM

More Telugu News