Karnataka: నేను చేయగలిగిందంతా చేశా: డీకే శివకుమార్

Left The Decision on Party High Command says Dk shivakumar
  • సీఎం పదవిపై నిర్ణయం హైకమాండ్ కే వదిలేద్దామని వ్యాఖ్య
  • పుట్టిన రోజు వేడుకల కారణంగా ఢిల్లీకి వెళ్లలేకపోతున్నట్లు వివరణ
  • అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకుంటానని వెల్లడి
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తాను చేయగలిగినంతా చేశానని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని వివరించారు. అందరం కలిసి రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని తెలిపారు. 

ఇక కాబోయే ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయాన్ని పార్టీ హైకమాండ్ కే వదిలేద్దామని డీకే పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీకి రమ్మంటూ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చిందని చెప్పారు. అయితే, సోమవారం తన పుట్టిన రోజు కావడంతో వెళ్లలేకపోయానని వివరించారు. ఇంట్లోవారితో కలిసి పూజల్లో పాల్గొనడంతో పాటు తాను చాలామందిని కలుసుకోవాల్సి ఉందని డీకే చెప్పారు.

పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని డీకే శివకుమార్ మరోమారు స్పష్టం చేశారు. ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని వెల్లడించారు. కర్ణాటక ప్రజలు తన పుట్టిన రోజుకు 135 సీట్లను బహుమతిగా ఇచ్చారని, ఇంతకంటే గొప్ప బహుమతి ఇంకేం ఉంటుందని అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో కాంగ్రెస్ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై హైకమాండ్ చర్చలు జరుపుతోంది. బెంగళూరులో ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీకి ముగ్గురు పరిశీలకులను కూడా పంపించింది. ఈ విషయంపై చర్చించేందుకు సీఎం పదవికి పోటీ పడుతున్న నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లను సోమవారం ఢిల్లీకి రమ్మని పిలిచింది.
Karnataka
Cm post
DK Shivakumar
Siddaramaiah
Congress
Delhi

More Telugu News