Dharmana Prasada Rao: రాష్ట్రంలో ఈ-చిట్స్ విధానాన్ని ప్రారంభిస్తున్నాం: మంత్రి ధర్మాన
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ-చిట్స్
- ఈ-చిట్స్ ఒక ఎలక్ట్రానిక్ విధానం అని ధర్మాన వెల్లడి
- దీని సాయంతో చిట్ ఫండ్ చందాదారుల డబ్బుకు భద్రత ఉంటుందని వివరణ
- ఇకపై చిట్ ఫండ్స్ సంస్థలు ఆన్ లైన్ లావాదేవీలే జరపాలని స్పష్టీకరణ
రాష్ట్రంలో ఈ-చిట్స్ విధానాన్ని తీసుకువస్తున్నామని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ-చిట్స్ అనేది ఒక ఎలక్ట్రానిక్ విధానం అని వెల్లడించారు. దీని సాయంతో చిట్ ఫండ్స్ చందాదారులు తమ డబ్బు సురక్షితంగా ఉందో, లేదో తెలుసుకోవచ్చని అన్నారు. ఇకపై చిట్ ఫండ్స్ సంస్థలు ఆన్ లైన్ ద్వారానే లావాదేవీలు జరపాలని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆయా లావాదేవీలను పరిశీలించి ఆమోదం తెలుపుతారని వివరించారు.
రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ-చిట్స్ విధానం పనిచేస్తుందని తెలిపారు. చిట్ ఫండ్స్ చందాదారుల సొమ్ముకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ విధానం అమలు చేస్తున్నామని, ఈ-చిట్స్ ద్వారా చిట్ ఫండ్ వ్యాపారంలో పారదర్శకత వస్తుందని భావిస్తున్నామని ధర్మాన పేర్కొన్నారు.