DK Shivakumar: ఒంటరిని.. ఒంటరిగానే గెలిపించా: సీఎం పదవి ఎంపికకు ముందు శివకుమార్ కీలక వ్యాఖ్య
- 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని వ్యాఖ్య
- సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడి
- అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన డీకే
- 15 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా బాధపడలేదన్న శివకుమార్
తాను ఒంటరిగా బరిలో నిలిచానని, ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. తనకు తమ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. కాంగ్రెస్ నేతలు అందరూ గెలుపు కోసం సహకరించారన్నారు. ఆయన తన నివాసంలో మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడే సమయంలో కాస్త అసంతృప్తి, ఉద్వేగం కనిపించాయి.
సిద్ధరామయ్య తన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారని డీకే గుర్తు చేశారు. తమ పార్టీలో తన మద్దతుదారుల సంఖ్య ఎంతో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో మాత్రం అధిష్ఠానానిదే తుది నిర్ణయం అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియాకు గిఫ్ట్ ఇస్తానని చెప్పానని, అదే చేశానన్నారు.
తన గురువును కలిశాక తాను ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. గతంలో పదిహేను మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వెళ్లినప్పటికీ తాను ధైర్యం కోల్పోకుండా పార్టీ కోసం ఒంటరిగా నిలబడ్డానని చెప్పారు. మొత్తానికి కర్ణాటకలో పార్టీని గెలిపించింది తాను మాత్రమేనని చెప్పే ప్రయత్నం చేశారు. ఖర్గేకు అన్నీ తెలుసునని, ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయనున్న సమయంలో డీకే శివకుమార్ బహిరంగంగా కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.