Cricket: 214 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందుంచిన ఢిల్లీ
- 37 బంతుల్లో 82 పరుగులతో రెచ్చిపోయిన రిలీ రోసోవ్
- రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు చేసిన ఢిల్లీ
- ఖాతా తెరవకుండానే ధావన్ వికెట్ ను కోల్పోయిన పంజాబ్
పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 213 పరుగులు చేసి, పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లలో రిలీ రోసోవ్ 37 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 82 పరుగులు, పృథ్వీషా 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 54 పరుగులు, డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 26 పరుగులు చేశారు. వార్నర్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన రోసోవ్ వచ్చీ రావడంతోనే అదరగొట్టాడు. 25 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ సాధించాడు.
ఇక పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. శిఖర్ ధవన్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇషాంత్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి స్లిప్ లో అమన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పంజాబ్ ఖాతా తెరవకముందే ధావన్ వికెట్ ను కోల్పోయింది. ప్రభుసిమ్రన్, అథర్వ తైడే క్రీజులో ఉన్నారు.