hottest period: వచ్చే ఐదేళ్లూ ఎండల తీవ్రత ఎక్కువే: ఐక్యరాజ్యసమితి

Next 5 years could be hottest ever globally warns UN weather agency

  • 2023-27 హాటెస్ట్ పీరియడ్ గా పేర్కొన్న ఐక్యరాజ్యసమితి 
  • ఏదో ఒక ఏడాది మాత్రం ఎండలు దంచికొడతాయని అంచనా
  • ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయని హెచ్చరిక

ఏటేటా వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతూ పోతోంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోగా, ఇలా ఐదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం ప్రకటించింది. 2023-27 కాలాన్ని అత్యంత వేడితో కూడిన ఐదేళ్ల కాలంగా పేర్కొంది. 2016లో నమోదైన అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డు కూడా చెరిగిపోవచ్చని అంచనా వేసింది. ఈ ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. 

సాధారణంగా తలెత్తే ఎల్ నినో పరిస్థితులకు తోడు, గ్రీన్ హౌస్ గ్యాసుల వల్ల ఈ పరిణామం చోటు చేసుకుంటున్నట్టు ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం తెలిపింది. ఎల్ నినోతో సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. పసిఫిక్ మహా సముద్రం నీరు వేడెక్కడాన్ని ఎల్ నినోగా చెబుతారు. 2023-27 మధ్య కాలంలో ఒక ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి 66 శాతం అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఎల్ నినోకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. వాతావరణంలో మార్పులు ప్రపంచ ఉష్ణోగ్రతలను పైకి తీసుకెళతాయని అంచనా వేసింది.

‘‘దీనివల్ల ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయి. ఆహార భద్రత, నీటి నిర్వహణ, పర్యావరణపరమైన సవాళ్లు ఎదురవుతాయి. ఇందుకు సన్నద్ధం కావాల్సిందే’’ అని ప్రపంచ ఆరోగ్య వాతావరణ విభాగం సెక్రటరీ జనరల్ ప్రెట్టేరి తాలస్ పేర్కొన్నారు. 2023-27 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటుతో పోలిస్తే 1.5 - 1.8 డిగ్రీల వరకు ఎక్కువ నమోదు కావచ్చని తెలిపింది. పారిస్ అగ్రిమెంట్ ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దికి 2 డిగ్రీల పెరుగుదలకు పరిమితం చేయాలి.

  • Loading...

More Telugu News