Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ లోకి రమ్మంటున్నారు.. వెళ్లేది లేదు!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

komatireddy rajagopal reddy clarity on party change rumors

  • కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన.. తెలంగాణలో గెలవాలని ఏముందన్న కోమటిరెడ్డి
  • తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని స్పష్టీకరణ
  • రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • రేవంత్ బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లు సంపాదించారని ఆరోపణ

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత.. తనను కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన.. తెలంగాణలో గెలవాలని ఏముందని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలో ఒకే తరహా పరిస్థితులు ఉండవన్నారు.

తాను కాంగ్రెస్ లోకి తిరిగి వస్తానని ఎక్కడా చెప్పలేదని, పార్టీ మారుతున్నాననే ఊహాగానాల్లో నిజం లేదని చెప్పారు. ఆ వార్తలను నమ్మొద్దని, తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, దుష్ప్రచారాలతో బీజేపీని బలహీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

‘‘రేవంత్ బ్లాక్ మెయిల్ చేసి.. రూ.కోట్లు సంపాదించారు. ఆయన 20 ఏళ్లు టీడీపీలో ఉండి కాంగ్రెస్ లో చేరారు. మేం ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్లం. ఈ మధ్యే వచ్చిన రేవంత్ నాయకత్వంలో ఎలా పని చేయాలి?’’ అని ప్రశ్నించారు. 

రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ ను గద్దె దించడానికే తాను బీజేపీలో చేరానని చెప్పారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారే వాడినైతే తనను కేసీఆర్ చాలా సార్లు బీఆర్ఎస్ లోకి రమ్మన్నారని చెప్పారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే మనిషిని కానన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం బీజేపీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ తో గంటసేపు మాట్లాడినట్లు చెప్పారు. తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ని మార్చాలని ఎవరూ లాబీయింగ్ చేయడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News