Vishnu Vardhan Reddy: వైసీపీ ఇచ్చిన హామీలను కనీసం గుడివాడలోనైనా పూర్తిగా నెరవేర్చారా?: కొడాలి నానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నలు
- ప్రజా చార్జిషీట్‌పై చర్చకు రావాలని కొడాలి నానికి విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్
- కొడాలి నాని వచ్చినా.. వైసీపీ పెద్దలు కట్టకట్టుకుని వచ్చినా తాను రెడీ అని వెల్లడి
- ఏపీలో వైసీపీకి అనుకూల ఓటేలేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదని వ్యాఖ్య
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం గుడివాడలోనైనా పూర్తిగా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ప్రజా చార్జిషీట్‌పై చర్చకు సిద్ధమా అని ఆయన నిలదీశారు.
విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు గన్నవరం బస్టాండ్ దగ్గర బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కొడాలి నానికి చాలెంజ్ విసిరారు. ‘‘కొడాలి నాని వచ్చినా.. వైసీపీ పెద్దలు కట్టకట్టుకుని వచ్చినా నేను రెడీ. మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కనీసం గుడివాడలోనైనా పూర్తిగా నెరవేర్చామని చెప్పగలరా?’’ అని ప్రశ్నించారు.
2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలవబోతోంది’’ అని చెప్పారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీలు.. ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు.
ఏపీలో వైసీపీకి అనుకూల ఓటే లేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాగేందుకు నీరు లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని మండిపడ్డారు. ‘‘రేపు గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగనుంది. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుంది’’ అని వెల్లడించారు.