KCR: తెలంగాణ మహిళా బాక్సర్ కు రూ.2 కోట్ల సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్
- నూతన సచివాలయానికి వెళ్లిన నిఖత్ జరీన్
- సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బాక్సర్
- నిఖత్ సాధించిన విజయాల పట్ల అభినందించిన సీఎం కేసీఆర్
- ఒలింపిక్స్ లోనూ పతకం తీసుకురావాలని ఆకాంక్ష
- సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా
ఇటీవల ఘన విజయాలతో ప్రపంచ స్థాయిలో భారత్ కీర్తిపతాకను రెపరెపలాడిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం అందించాలని నిర్ణయించింది. నిఖత్ జరీన్ ఇవాళ కొత్త సచివాలయానికి వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆమె సాధించిన విజయాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ అభినందించారు. ఒలింపిక్స్ కోసం సన్నద్ధత, మెరుగైన శిక్షణ, సాధన ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఈ క్రమంలో నిఖత్ జరీన్ కు రూ.2 కోట్ల సాయాన్ని అందిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఒలింపిక్స్ లోనూ నిఖత్ జరీన్ పతకం సాధించాలని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
26 ఏళ్ల నిఖత్ జరీన్ 2022, 2023లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ టైటిళ్లను గెలవడం విశేషం. గతేడాది బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ నిఖత్ ను పసిడి వరించింది. ఇప్పుడు నిఖత్ ఒలింపిక్స్ లక్ష్యంగా కృషి చేస్తోంది.