Amit Shah: ఆధునిక భారత దేశ చరిత్రలో ఆ నలుగురు గుజరాతీయులది కీలక పాత్ర: హోం మంత్రి అమిత్ షా
- శ్రీ ఢిల్లీ గుజరాతీ సమాజ్ ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు
- కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హోం మంత్రి అమిత్ షా ప్రసంగం
- తన ప్రసంగంలో మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, నరేంద్ర మోదీల ప్రస్తావన
- ఆధునిక భారత దేశ చరిత్రలో ఈ నలుగురు గుజరాతీయులదీ కీలక పాత్ర అని వ్యాఖ్య
ఆధునిక భారత దేశ చరిత్రలో నలుగురు గుజరాతీయులది కీలక పాత్ర అని హోం మంత్రి అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు. శ్రీ ఢిల్లీ గుజరాతీ సమాజ్ ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘‘మహాత్మా గాంధీ , సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, నరేంద్ర మోదీ.. ఈ నలుగురు గుజరాతీయులు భారత దేశ ఆధునిక చరిత్రలో కీలక పాత్ర పోషించారు’’ అని వ్యాఖ్యానించారు.
మహాత్మాగాంధీ వల్ల దేశానికి స్వాతంత్ర్యం వస్తే, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేశారని అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మొరార్జీ దేశాయ్ పునరుత్తేజితం చేశారని, నరేంద్ర మోదీ కారణంగా భారతదేశ పేరు ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తమయ్యాయని హోం మంత్రి వ్యాఖ్యానించారు. గుజరాతీయులు దేశంతో పాటూ ప్రపంచమంతటా ఉన్నారని, స్థానికులతో కలిసిపోతూ సామాజిక అభ్యున్నతికి వారు పాటుపడతారని ఆయన వ్యాఖ్యానించారు.