Jagan: వాలంటీర్లను లీడర్లుగా చేస్తా.. ప్రభుత్వానికి అండగా నిలబడండి: ఏపీ సీఎం జగన్

CM Jagan Speech at Felicitation Of Volunteers At Vijayawada
  • వాలంటీర్ల వ్యవస్థ.. లంచాలు, అవినీతి లేని తులసి మొక్కలాంటిదన్న జగన్
  • వాళ్లు నవరత్నాల ఫిలాసఫీకి సారథులని వ్యాఖ్య
  • 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందిస్తున్న సేవకులు, సైనికులని ప్రశంస
  • రూ.3 లక్షల కోట్లను నాలుగేళ్లలో ప్రజలకు అందించినట్లు వెల్లడి 
వాలంటీర్లను లీడర్లుగా చేస్తానని గతంలో చెప్పానని, ఆ మాట గుర్తు పెట్టుకోవాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలోని విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ జగన్ పెట్టుకున్న నమ్మకం వాలంటీర్ వ్యవస్థ. ఎక్కడా లంచాలు లేవు.. వివక్ష చూపలేదు. లంచాలు, అవినీతి లేని తులసి మొక్కలాంటిది వాలంటీర్ల వ్యవస్థ’’ అని చెప్పారు. 

‘‘వాలంటీర్లను ఉద్దేశించి నేను మొట్టమొదట ఇచ్చిన స్పీచ్ మీకు గుర్తు ఉందా.. మిమ్మల్ని లీడర్లుగా చేస్తానని చెప్పాను. ఆ మాట గుర్తు పెట్టుకోండి. నవరత్నాల ఫిలాసఫీకి సారథులు మీరు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రజలందరికీ మోటివేటర్లుగా, మన ప్రభుత్వానికి అండగా మీరందరూ నిలబడాలని కోరుతున్నా’’ అని అన్నారు. 

ఏపీలో ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులుగా వాలంటీర్లు ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నట్లు జగన్ తెలిపారు. అవ్వాతాతలకు మంచి మనుమరాలు, మనుమడిగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులని వాలంటీర్లను కొనియాడారు.

2019 నుంచి 2.66 లక్షల మంది సైన్యం ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వాలంటీర్ల ద్వారా ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్లపట్టాలు, రైతు భరోసా అన్ని పథకాల అమలు వాలంటీర్ల భాగస్వామ్యంతోనే సాధ్యమైందన్నారు. 

రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్లను నాలుగేళ్లలో ప్రజలకు అందించినట్లు సీఎం జగన్ చెప్పారు. లంచం తీసుకోవాలనే ఆలోచన రాకుండా గుర్తింపునివ్వడానికి ప్రతి ఏటా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జగన్ వెల్లడించారు. 

రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇంకా ఎక్కువగా వెళ్లే పరిస్థితి రావాలని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా చూపించాలని, ఇంతకు ముందు ఈ మంచి జరిగిందో లేదో అడగాలని వాలంటీర్లను సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి చేసే అవకాశం రావాలని అన్నారు.
Jagan
Volunteers
navaratnalu
YSRCP
TDP

More Telugu News