Jagan: ప్రతిపక్షాలకు డజను మాత్రలు వేసినా తగ్గనంత కడుపు మంట: జగన్

ap cm jagan fires on chandrababu in volunteers vandhanam programme in vijayawada

  • వాలంటీర్ వ్యవస్థపై విపరీతమైన దుష్ప్రచారం చేశారన్న జగన్
  • ప్రభుత్వంపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • వాలంటీర్లు జగనన్న సైన్యమని చంద్రబాబు అంటున్నారని వ్యాఖ్య
  • ఆయనకు వాలంటీర్ల వ్యవస్థంటే కడుపుమంటని విమర్శ 

వాలంటీర్ వ్యవస్థ మీద డజను జెలుసిల్ మాత్రలు వేసినా తగ్గనంత కడుపు మంట ప్రతిపక్షాలకు ఉందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థ మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారని, అల్లరి మూకలని, మూటలు మూసే ఉద్యోగమని, అధికారం వస్తే వాలంటీర్లను రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.

వాలంటీర్ల ఏర్పాటుపై గతంలో కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని వివరించారు. వాలంటీర్ల సేవాభావానికి ప్రజలు మెచ్చుకోవడం మొదలవడంతో చంద్రబాబు మాట మార్చి అధికారంలోకి వస్తే కొత్త జన్మభూమి కమిటీలతో వాలంటీర్ సైన్యాన్ని తీసుకోస్తామన్నాడని గుర్తు చేశారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాజకీయాలు జరుగుతున్నా, వాలంటీర్లు తన ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పారు. 

‘‘సూర్యోదయానికి ముందే ఫించన్లు ఇస్తుంటే నిందలు వేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇస్తుంటే.. తలుపులు తట్టడానికి వీరెవరంటూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. వాలంటీర్లను జగనన్న సైన్యం అంటూ చంద్రబాబు అంటున్నారు’’ అని జగన్ మండిపడ్డారు.

‘‘ప్రభుత్వంపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో అంతా చూస్తున్నారు. పేదల ప్రభుత్వం మీద గిట్టని వారే తప్పుడు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారు. నిజాలను ప్రజలకు వివరించే సత్య సారథులు, సత్య సాయుధులు వాలంటీర్లు మాత్రమే’’ అని అన్నారు.

తనకు పత్రికలు, టీవీలు అండగా లేకపోయినా, ప్రతి ఇంటికి నేరుగా వెళ్లగలిగే వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రతి గడప వద్దకు తీసుకెళ్లగలిగాం. ప్రతి ఇంట్లో మంచి జరిగిందో లేదో ధైర్యంగా అడిగే హక్కు వాలంటీర్లతోనే సాధ్యమైంది. వాలంటీర్ వ్యవస్థతో ప్రతి గడపలో మంచి తప్ప చెడు ఎక్కడా చేయలేదు’’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News