Narendra Modi: మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

PM Narendra Modi leaves for foreign tour

  • నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
  • హిరోషిమాలో జీ7, క్వాడ్ సదస్సులకు హాజరు
  • పాపువా న్యూ గినియాలో ఎఫ్ఐపీఐసీ సదస్సులో పాల్గొననున్న మోదీ
  • ఆస్ట్రేలియా ప్రధానితో చర్చలు, ప్రవాస భారతీయులతో ముఖాముఖి

ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు బయల్దేరారు. తాజా పర్యటన 3 దేశాల్లో సాగనుంది. ఈ పర్యటన కోసం ప్రధాని మోదీ కొద్దిసేపటి కిందట దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయల్దేరారు. 

విదేశీ పర్యటనలో భాగంగా మోదీ జపాన్ లోని హిరోషిమా నగరంలో జరిగే జీ7, క్వాడ్ సదస్సులలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. పాపువా న్యూ గినియాలో నిర్వహించే ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోపరేషన్ (ఎఫ్ఐపీఐసీ) శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని మోదీ హాజరు కానున్నారు.

హిరోషిమా పర్యటనలో భాగంగా భారత జాతిపిత మహాత్మాగాంధీ ప్రతిమను మోదీ ఆవిష్కరించనున్నారు. తన పర్యటనలో భాగంగా మోదీ 40కి పైగా సమావేశాల్లో పాల్గొంటారు. రెండు డజన్ల మందికి పైగా ప్రపంచ నేతలతో ఈ సదస్సుల్లో సమావేశం కానున్నారు. ఇందులో కొన్ని ద్వైపాక్షిక సమావేశాలు కూడా ఉన్నాయి. హిరోషిమా నగరంలో జరిగే క్వాడ్ సదస్సుకు భారత ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆతిథ్య దేశం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా హాజరు కానున్నారు. 

ప్రధాని మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్ ను పరిశీలిస్తే... ఈ నెల 19 నుంచి 21 వరకు జపాన్ లో వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అనంతరం, ఈ నెల 22న పాపువా న్యూ గినియాలో ఎఫ్ఐపీఐసీ సదస్సులో పాల్గొంటారు. తన పర్యటన చివరిలో ఆస్ట్రేలియా చేరుకుంటారు. ఈ నెల 23న ఆస్ట్రేలియా ప్రధానితో చర్చలు, ప్రవాస భారతీయులతో ముఖాముఖి కార్యక్రమాలకు హాజరవుతారు.

  • Loading...

More Telugu News