Shahrukh Khan: ప్లీజ్.. నిన్ను వేడుకుంటున్నా.. నార్కోటిక్స్ అధికారి వాంఖెడేతో షారుఖ్ ఖాన్ నాటి చాటింగ్ వెల్లడి
- ఆర్యన్ ఖాన్ కేసులో అక్రమవసూళ్లకు ప్రయత్నించారంటూ సమీర్ వాంఖెడేపై ఆరోపణ
- ఆర్యన్ ఖాన్ తండ్రి షారూఖ్‌తో తన సంభాషణలను కోర్టుకు సమర్పించిన వాంఖెడే
- తన కుమారుడిని విడిచిపెట్టాలంటూ వేడుకున్నట్టు వెల్లడి
మాదకద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టుకు సంబంధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్కోటిక్స్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖెడే శుక్రవారం కోర్టుకు కొన్ని కీలక పత్రాలు సమర్పించారు. తన బిడ్డను విడిచిపెట్టమంటూ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనతో చాట్ చేశారని వాంఖెడే పేర్కొన్నారు.
2021 అక్టోబర్ 3న ఓ క్రూయిజ్ షిప్‌లో మాదకద్రవ్యాలు ఉన్నాయన్న సమాచారంతో అప్పటి జోనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రెయిడ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పోలీసులకు చిక్కాడు. ఆ తరువాత నెల రోజులకు అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
అయితే, ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్‌కు విముక్తి కల్పించేందుకు వాంఖెడే షారుఖ్ ఖాన్‌ను రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు, తాను ఏ తప్పుచేయలేదనేందుకు రుజువుగా వాంఖెడే..షారుఖ్‌తో జరిపిన సంభాషణలను కోర్టుకు సమర్పించారు.
‘‘నిన్ను వేడుకుంటున్నా. అతడిని జైలు పాలు చేయకు. నాపై, నా కుటుంబంపై దయ చూపించు. మేము చాలా సాధారణ మనుషులం. నా బిడ్డ కాస్తంత దారితప్పినా కరుడుకట్టిన నేరస్తుడిలా అతడిని జైల్లో పెట్టడం సబబు కాదు’’ అని రాసున్న సందేశాలను వాంఖడే కోర్టులో సమర్పించారు. ఈ మేసేజీల చివర్లో ‘ప్రేమతో.. ఎస్‌ఆర్‌కే‘ అని రాసుండడాన్ని కూడా ప్రస్తావించారు. అయితే, ఇవి షారూఖ్ ఖాన్ స్వయంగా పంపిన సందేశాలా? కాదా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయాలపై షారుఖ్ ఖాన్ ఇప్పటివరకూ స్పందించలేదు.