Australia: ఒంటిపై అయిదున్నర కిలోల దుస్తులు ధరించిన యువతికి విమానాశ్రయంలో జరిమానా!
- ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఘటన
- తన లగేజీ బరువు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించిన యువతి
- అదనపు ఫీజును తప్పించుకునేందుకు దుస్తులన్నీ తనే ధరించిన వైనం
- ఒంటిపై అయిదున్నర కేజీల దుస్తులతో ఇక్కట్లపాలు
- అయినా లగేజీ బరువు ఎక్కువగా ఉండటంతో డబ్బు కట్టిన వైనం
అదనపు లగేజీకి డబ్బు కట్టకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ విమాన ప్రయాణికురాలికి చివరకు చుక్కెదురైంది. ఆమె ప్రయత్నం బెడిసి కొట్టడంతో జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆడ్రియానా అనే యువతి తన స్నేహితురాలితో కలిసి టూర్ కి వెళ్లింది. టూర్ పూర్తయ్యాక అడిలైడ్‌లోని తన ఇంటికి బయలుదేరింది.
అయితే, విమానాశ్రయంలో చెకింగ్ సందర్భంగా తన లగేజీ బరువు ఎక్కువగా ఉన్నట్టు ఆమె గుర్తించింది. దీంతో, లగేజీలోని అదనపు దుస్తులను తనే వేసుకుంటే అదనపు చార్జీలు తగ్గుతాయని భావించింది. ఈ క్రమంలో ఆమె మొత్తం అయిదున్నర కేజీల బరువున్న దుస్తులను ఒంటిపై ధరించింది. ఫలితంగా, ఆమె చూసేందుకు ఓ పెద్ద భల్లూకంలా కనిపించింది.
ఇదంతా ఆ యువతి స్వయంగా ఓ టిక్‌టాక్ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇంత చేసినా కూడా లగేజీ బరువు కిలో ఎక్కువగా ఉండటంతో యువతి చివరకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తనకు ఎదురైన పరిస్థితి గురించి టిక్‌టాక్ వీడియోలో వివరించిన యువతి, తనలాగా మరెవ్వరూ ప్రయత్నించకూడదని సలహా ఇచ్చింది. ఇలా అన్ని దుస్తులు ధరించి విమానంలో ప్రయాణించడం తనకే కాకుండా తోటి ప్రయాణికులకు కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకొచ్చింది.