Rs 2000 note: రూ.2,000 నోటు రద్దు ఇప్పుడే ఎందుకు? ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందా?
- ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
- వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో సాధారణ ఎన్నికలు
- నల్లధనం, కరెన్సీ వినియోగానికి చెక్ పెట్టే వ్యూహం
- ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండదంటున్న నిపుణులు
2016 నవంబర్ లో రూ.500, రూ.1,000 నోట్లను మోదీ సర్కారు రద్దు చేసింది. నల్లధనాన్ని నియంత్రించడం, నకిలీ కరెన్సీకి, ఉగ్రవాదులకు నిధుల సరఫరాకు చెక్ పెట్టడం కోసమే అలా చేసినట్టు చెప్పుకొచ్చింది. అదే సమయంలో తిరిగి నూతన రూ.500, రూ.2,000, రూ.200 నోట్లను ప్రవేశపెట్టింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం ఏమిటి? రూ.2,000 నోటును విడుదల చేయడం ఏమిటి? రూ.2,000 నోట్లతో నల్లధనం పోగేసుకోవడం మరింత సులభం కాదా? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే రూ.2,000 నోటును మలి విడతలో రద్దు చేయవచ్చన్న అంచనాను కొందరు నిపుణులు అప్పట్లోనే వ్యక్తీకరించారు. ఇప్పుడు అదే నిజమైంది.
నాటి పెద్ద నోట్ల రద్దుతో వ్యవస్థలో అందుబాటులో ఉన్న 86 శాతం కరెన్సీ నోట్లు చెల్లకుండా పోయాయి. మరి డబ్బు లేకుండా జీవనం ఎలా? ఆర్థిక లావాదేవీలు ఎలా? అందుకే రూ.2,000 నోటును తీసుకొచ్చినట్టు ఆర్ బీఐ ప్రకటించింది. కొన్నేళ్ల తర్వాత నుంచి (2018) రూ.2,000 నోట్ల సరఫరాను తగ్గిస్తూ వచ్చింది. కొంత కాలంగా బ్యాంకు ఏటీఎంల్లోనూ వీటిని పెట్టడం లేదు. డిజిటల్ చెల్లింపులు పెరిగి, ఇతర కరెన్సీ నోట్లు పెద్ద మొత్తంలో అందుబాటులోకి రావడంతో ఇప్పుడు రూ.2,000 నోటును వెనక్కి తీసుకుంటున్నారు.
రూ.2,000 నోటు ఉపసంహరణ నిర్ణయాన్ని ఈ సమయంలోనే ఎందుకు తీసుకున్నదీ ఆర్ బీఐ, కేంద్ర సర్కారు వెల్లడించలేదు. కాకపోతే ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరం ఇందులో ఉన్నాయి. ఇందులో మిజోరం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలూ బీజేపీకి కీలకమైనవి. వీటితోపాటు 2024 లోక్ సభ ఎన్నికలతోపాటు మరో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జగరనున్నాయి. ఎన్నికల సమయంలో కరెన్సీ నోట్లు పెద్ద మొత్తంలో చలామణీ అవుతుంటాయి. ఓటర్లకు పెద్ద ఎత్తున నోట్లను పంచే అభ్యర్థులూ ఉన్నారు. కనుక ఇలా పోగేసిన నల్లధనం వినియోగానికి కేంద్ర సర్కారు చెక్ పెట్టే ఎత్తు వేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో రూ.2,000 నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం కరెన్సీ చలామణిలో పెద్ద నోటు వాటా 10.82 శాతమే. కనుక రూ.2,000 నోటు ఉపసంహరణతో ప్రభావం ఏమీ పడదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్న నోట్లు తగినంతగా అందుబాటులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 2016 నుంచి ఇప్పటికి డిజిటల్ లావాదేవీలు, ఈ కామర్స్ బాగా వృద్ధి చెందినట్టు చెబుతున్నారు. రూ.2,000 నోట్లనే వినియోగించే చిన్న వ్యాపారులు ఎవరైనా, ఉంటే, నిర్మాణ రంగ కాంట్రాక్టర్లకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చని చెబుతున్నారు. కాకపోతే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు అనుమతించినందున.. వెంటనే ఇతర డీనామినేషన్ లోకి మార్చుకోవడం సులభమేనని అంటున్నారు.