Vijay Rangaraju: ఫుడ్డు లేక మంచినీళ్లతో కడుపునింపుకునేవాడిని: సీనియర్ విలన్ విజయ రంగరాజు
- పేరు తెచ్చిపెట్టిన సినిమా 'భైరవద్వీపం'
- తొలి సినిమా 'సీతా కల్యాణం' అని వ్యాఖ్య
- తొలి పారితోషికం 150 రూపాయలని వెల్లడి
తెలుగు తెరపై చాలామంది ఆర్టిస్టులు విలన్ వేషాల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి ప్రతినాయకుల జాబితాలో విజయ రంగరాజు ఒకరుగా కనిపిస్తారు. తెలుగులో విలన్ గా ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ, అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర మాత్రం 'భైరవద్వీపం' సినిమాలోని భైరవుడి పాత్రనే.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని ఉండేది. అయితే అందుకోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తరువాత సినిమాలపై దృష్టిపెట్టాను. తినడానికి ఫుడ్డు ఉండేది కాదు .. మంచినీళ్లు తాగేసి పడుకునేవాడిని. ఎక్కడైనా పెళ్లిళ్లు జరుగుతూ ఉంటే, అక్కడికి వెళ్లి తినేసి వచ్చేవాడిని" అని అన్నారు.
నా మొదటి సినిమా బాపు గారి దర్శకత్వంలోని 'సీతా కల్యాణం'. రోజుకి 150 రూపాయలు ఇస్తామని అన్నారు. నేను అడ్వాన్స్ అడిగేసరికి వాళ్లు ఆశ్చర్యపోయారు. అంతవరకూ ముఖానికి మేకప్ వేయని నేను అడ్వాన్స్ అడగడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తరువాత నా ధైర్యానికి మెచ్చుకుంటూ 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పంపించారు" అంటూ నవ్వేశారు.