Kumaram Bheem Asifabad District: కుక్క కాటుతో దూడ మృతి.. 302 మందికి టీకాలు!
- కుమ్రంభీం జిల్లా చింతలమానెలపల్లిలో ఘటన
- కుక్కకాటుతో 15 రోజుల తర్వాత మరణించిన దూడ
- అప్పటి వరకు అది తల్లిపాలు తాగి ఉండడంతో విషపూరితం అయి ఉంటాయని ప్రచారం
కుక్కకాటుకు గురై దూడ మరణిస్తే దాని తల్లి పాలు తాగిన గ్రామస్థులు భయపడి టీకాలు వేయించుకున్నారు. తెలంగాణలోని కుమ్రంభీం జిల్లా చింతలమానెలపల్లిలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన పాలవ్యాపారి నానయ్యకు చెందిన దూడకు 15 రోజుల క్రితం కుక్క కరిచింది. దానికి టీకాలు వేయించకపోవడంతో వారం రోజుల క్రితం అది మరణించింది. అప్పటి వరకు అది తల్లిపాలు తాగడంతో అవి విషపూరితం అయి ఉంటాయన్న ప్రచారం జరిగింది.
దీంతో గ్రామస్థులు భయపడ్డారు. విషయం తెలిసిన ఎంపీడీవో మహేందర్ పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నానయ్య వద్ద పాలు, పెరుగు తీసుకున్న వారంతా వచ్చి టీకాలు వేయించుకోవాలని ప్రచారం చేశారు. దీంతో 302 మంది టీకాలు వేయించుకున్నారు.
కాగా, గ్రామస్థులు భయపడుతున్నట్టు ఏమీ జరగదని, దూడ తల్లి పొదుగు వద్ద కొరికితే తప్ప పాలు విషపూరితమయ్యే ప్రమాదం ఏమీ ఉండదని పశువైద్యాధికారులు తెలిపారు. దీనికి తోడు పాలను వేడి చేసుకుని వినియోగిస్తాం కాబట్టి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.