Hiroshima: మా దేశంలో కూడా మీరు బాగా పాపులర్.. మోదీతో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్
- సినిమా స్టార్లు కూడా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అన్న ప్రెసిడెంట్
- హిరోషిమాలో జరిగిన క్వాడ్ దేశాధినేతల సమావేశంలో బైడెన్, మోదీ చిట్ చాట్
- ఆస్ట్రేలియాలోనూ ఆయన క్రేజ్ మామూలుగా లేదన్న ప్రధాని ఆంటోని ఆల్బనీస్
జపాన్ లోని హిరోషిమాలో శనివారం క్వాడ్ దేశాధినేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రధాని మోదీ అమెరికాలో కూడా బాగా పాప్యులర్ అయ్యారని బైడెన్ చెప్పారు. ‘మా దేశంలో కూడా మీరు బాగా పాప్యులర్ అయ్యారు. మీరు వస్తున్నారని తెలిసి చాలామంది మిమ్మల్ని కలవాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చే నెలలో వాషింగ్టన్ లో మీతో పాటు డిన్నర్ తీసుకునే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించాలంటూ చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. సినిమా స్టార్ల నుంచి మా బంధువుల దాకా.. గతంలో ఎన్నడూ ఫోన్ చేయనివారు కూడా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. మీరు నిజంగా నన్ను బాగా ఇరకాటంలో పెడుతున్నారు’ అంటూ మోదీతో బైడెన్ చెప్పారు.
బైడెన్ మాట్లాడుతున్నది విని అక్కడే ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ మాట్లాడుతూ తనకూ అదే సమస్య ఎదురయ్యిందని చెప్పారు. భారత ప్రధాని మోదీ పాప్యులారిటీ ఆస్ట్రేలియాలో కూడా పెరిగిపోయిందని చెప్పారు. చాలామంది ఆస్ట్రేలియన్లు మోదీని కలిసేందుకు ఎదురుచూస్తున్నారని వివరించారు. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ వస్తున్నారని తెలిసి పలువురు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారని ఆల్బనీస్ చెప్పారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈ క్వాడ్ సదస్సు ఆస్ట్రేలియాలోనే జరగాల్సింది. ఈ సదస్సు కోసం ఆస్ట్రేలియా ఏర్పాట్లు కూడా చేసింది. చివరి నిమిషంలో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తన షెడ్యూల్ మార్చుకోవాల్సి రావడంతో క్వాడ్ దేశాధినేతలు టోక్యోలో భేటీ అయ్యారు.