Tiger: ప్రకాశం జిల్లాలో పెద్దపులి కలకలం
- అర్ధవీడు మండలంలో పులి సంచారం
- పులి పాదముద్రలను సేకరించిన అధికారులు
- తాగునీటి కోసం కంభం చెరువు వద్దకు వచ్చిందని నిర్ధారణ
ప్రకాశం జిల్లాలో పెద్దపులి కలకలం రేగింది. జిల్లాలోని అర్ధవీడు మండలంలో పులి సంచరిస్తుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాగుటూరు, నాగులవరం, గొట్టిపడియ లక్ష్మీపురం ప్రాంతాల్లో పులి సంచరించినట్టు గుర్తించారు.
పులి సంచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులి పాదముద్రలను సేకరించారు. ఈ పెద్దపులి నీరు తాగేందుకు నాగులవరం సమీపంలోని కంభం చెరువు వద్దకు వచ్చిందని అధికారులు నిర్ధారించారు. పులి సంచారం నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పులిని బంధించి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదే అర్ధవీడు మండలంలో గత జనవరిలోనూ పులి బెంబేలెత్తించింది. కాకర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఓ ఆవును చంపి తినేసింది. మరో ఆవుపై దాడి చేస్తుండగా రైతులు కేకలు వేయడంతో పారిపోయింది.