Madras High Court: అరెస్ట్ చేస్తున్నట్టు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందిస్తే చెల్లదు: మద్రాస్ హైకోర్టు
- హరిణి అనే మహిళ భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
- నిందితుడ్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఫోన్ కు ఎస్సెమ్మెస్
- హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన హరిణి
- పోలీసులకు అక్షింతలు వేసిన మద్రాస్ హైకోర్టు
ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నట్టు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందించడం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ వ్యక్తికి లభించే రాజ్యాంగపరమైన భరోసాకు ఇది తూట్లు పొడవడమేనని పేర్కొంది. గూండా యాక్ట్ కింద ఓ వ్యక్తి నిర్బంధాన్ని కొట్టివేసిన సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
హరిణి అనే మహిళ భర్త ఎళిల్ కుమార్ ను పోలీసులు గూండా యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. అతడు ఓ దారిదోపిడీకి కూడా పాల్పడినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేస్తున్నట్టు హరిణి ఫోన్ కు పోలీసులు సందేశం పంపారు. దీనిపై హరిణి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
తన భర్తను అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారం తప్ప, ఎస్సెమ్మెస్ లో మరే వివరాలు లేవని హరిణి పేర్కొంది. ఆ మేరకు ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులకు అక్షింతలు వేసింది.
ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం కనీసం నిందితుడికైనా తెలియాలి కదా అని పేర్కొంది. అరెస్ట్ కు గల కారణాన్ని తెలుసుకునే హక్కు అతడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఓ సంక్షిప్త సందేశం ద్వారా అరెస్ట్ సమాచారాన్ని పంపడం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ ఎం.సుందర్, జస్టిస్ ఎం.నిర్మల్ కుమార్ ధర్మాసనం పేర్కొంది. పైగా అతడి అరెస్ట్ కు చెబుతున్న కారణం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది.
పోలీసుల తరఫు న్యాయవాది దీనిపై స్పందిస్తూ, నిందితుడు అందించిన వివరాల మేరకు అతడి భార్యకు సమాచారం అందించడం జరిగిందని వివరించారు. ఈ వాదనను హైకోర్టు కొట్టిపారేసింది. పిటిషనర్ హరిణి భర్త ఎళిల్ కుమార్ ను విడుదల చేయాలని ఆదేశించింది.