Narendra Modi: జపాన్ దినపత్రికల నిండా మోదీ-జెలెన్ స్కీ భేటీ వార్తలే!
- హిరోషిమా నగరంలో జీ-7 దేశాల సదస్సు
- నిన్న మోదీ, జెలెన్ స్కీ మధ్య కీలక సమావేశం
- ఈ సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన జపాన్ మీడియా
జపాన్ లోని హిరోషిమా నగరం జీ-7 దేశాల సదస్సుకు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై తమ వైఖరికి కట్టుబడి ఉన్నట్టు మోదీ... జెలెన్ స్కీకి స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను చక్కదిద్దుకోవాలని పునరుద్ఘాటించారు.
ఈ నేపథ్యంలో, మోదీ-జెలెన్ స్కీ భేటీకి జపాన్ మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. జపాన్ దినపత్రికల నిండా వీళ్దిద్దరి సమావేశానికి సంబంధించిన వార్తలే దర్శనమిచ్చాయి. అంతేకాదు, జపాన్ మీడియా సంస్థలు జెలెన్ స్కీ హిరోషిమా పర్యటనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి.
తన పర్యటన సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. మెరుగైన ప్రజాస్వామ్యం దిశగా స్పష్టమైన ప్రపంచ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. మనందరి సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు.
కాగా, ఉక్రెయిన్ ప్రతిపాదిస్తున్న శాంతి కార్యక్రమంలో చేరాల్సిందిగా జెలెన్ స్కీ భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. తమ ప్రాదేశిక సమగ్రతకు, సార్వభౌమత్వానికి మద్దతు ఇస్తున్నారంటూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.