YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి కోసం కర్నూలులో సీబీఐ అధికారులు.. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కు ఎప్పటికప్పుడు సమాచారం

CBI officers sending updates from Kurnool to Delhi head quarters in YS Avinash Reddy issue
  • అవినాశ్ కోసం వచ్చినట్టు కర్నూలు ఎస్పీకి సమాచారమిచ్చిన సీబీఐ అధికారులు
  • శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులతో సీబీఐ అధికారుల చర్చలు
  • హైదరాబాద్, కడప నుంచి వచ్చిన సీబీఐ అధికారులు
కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కోసం సీబీఐ అధికారులు వెళ్లిన నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక విశ్వభారతి ఆసుపత్రిలో అవినాశ్ తల్లి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తన తల్లి అనారోగ్యం నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. వరుసగా మూడోసారి కూడా విచారణకు రాకపోవడంతో ఆయన కోసం సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. హైదరాబాద్, కడప నుంచి సీబీఐ అధికారులు వచ్చారు.

మరోవైపు అవినాశ్ ఉంటున్న ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్దకు కడప, పులివెందుల నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలే కాకుండా... స్థానిక కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆసుపత్రి గేటు వద్ద బైఠాయించి సీబీఐకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకోవైపు, అవినాశ్ కోసం వచ్చినట్టు కర్నూలు జిల్లా ఎస్పీకి సీబీఐ అధికారులు సమాచారం అందించారు. శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసు అధికారులతో వారు చర్చలు జరుపుతున్నారు. ఇంకోవైపు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను సీబీఐ అధికారులు ఎప్పటికప్పుడు ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ కు తెలియజేస్తున్నారు. మరోవైపు అవినాశ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారా? లేక మరోసారి నోటీసులు ఇస్తారా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.
YS Avinash Reddy
CBI
Kurnool
YSRCP

More Telugu News