Raghu Rama Krishna Raju: భయపడుతున్నది అవినాశ్ కాదు.. జగన్ భయపడుతున్నాడు: రఘురామకృష్ణరాజు
- బందరు నుంచి తాడేపల్లికి జగన్ చేరుకున్న వెంటనే అవినాశ్ ను అరెస్ట్ చేస్తారన్న రఘురాజు
- అవినాశ్ కు గుండె జబ్బు అని కొత్త డ్రామా చేస్తే అరెస్ట్ ఆగిపోవచ్చని వ్యాఖ్య
- జగన్ ఆదేశాలతోనే అవినాశ్ ను పోలీసులు కాపాడుతున్నారని మండిపాటు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సహనిందితుడైన వైఎస్ అవినాశ్ విషయంలో సీబీఐ ఇంతకు ముందులా లేదని, ఇప్పుడు చాలా సీరియస్ గా ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మాదిరి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం బందరు పర్యటనలో ఉన్నారని... ప్రజల మధ్య జగన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే బాగోదనే అవినాశ్ ను ఇంకా అరెస్ట్ చేయలేదని... జగన్ తాడేపల్లికి చేరుకున్న తర్వాత అవినాశ్ అరెస్ట్ ఉంటుందని అన్నారు. ఒకవేళ అవినాశ్ కు గుండెజబ్బు, హార్ట్ ఆపరేషన్ అంటూ 10 మంది డాక్టర్లు, 10 మంది యాక్టర్లు ఏదైనా డ్రామా చేస్తే అరెస్ట్ ఆగిపోవచ్చని అన్నారు.
సీబీఐ అరెస్ట్ చేస్తుందని అవినాశ్ భయపడుతున్నారని అందరూ అనుకుంటుంటారని... వాస్తవానికి భయపడుతున్నది అవినాశ్ కాదని, ముఖ్యమంత్రి జగన్ అని రఘురాజు చెప్పారు. సీబీఐ విచారణకు హాజరుకావాలనే హైదరాబాద్ కు అవినాశ్ వచ్చారని... అయితే కడపకు వెళ్లిపో, పులివెందులకు వెళ్లిపో అంటూ జగన్ చెప్పడంతో ఆయన వెళ్లిపోయారని అన్నారు. నిండా మునిగిన వాడికి చలి ఉండదని... ఇప్పటికే అవినాశ్ తండ్రి జైల్లో ఉన్నారని, ఇప్పుడు అవినాశ్ కూడా వెళ్తారని చెప్పారు.
అవినాశ్ రెడ్డి ఆఫ్ట్రాల్ తనలాంటి ఒక సాధారణ ఎంపీ అని... ఒక ఎంపీకి ఏపీలో విలువ లేదనే విషయం అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందని... ఎంపీ అయిన తనను పోలీసులు కొట్టారని, అవినాశ్ ను కూడా పోలీసులు లెక్క చేయరని... కేవలం జగన్ ఆదేశాలతోనే అవినాశ్ ను పోలీసులు కాపాడుతున్నారని రఘురాజు అన్నారు. అవినాశ్ ను అరెస్ట్ చేయడం సీబీఐ మగతనానికి పరీక్ష అని... ఈరోజు వాళ్లు వారి సత్తాను నిరూపించుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. రెండు, మూడు గంటల్లో అవినాశ్ అరెస్ట్ తప్పదని అన్నారు.