T20 cricket: టీ20లో ఇక నా పని అయిపోతోందని అనుకుంటున్నారు: కోహ్లీ
- తాను ఎప్పుడూ అలా అనుకోలేదన్న విరాట్ కోహ్లీ
- అత్యుత్తమ టీ20 క్రికెట్ ఆడానని ప్రకటన
- పరిస్థితులు అనుకూలించాలనే అంశం ప్రస్తావన
టీ20ల్లో కోహ్లీ పని అయిపోందన్న విమర్శలకు ఆర్సీబీ స్టార్ క్రికెటర్ కోహ్లీ తన సెంచరీతో సమాధానం ఇచ్చినట్టయింది. ఇదే అంశాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా ప్రస్తావించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ జట్టుపై ఆదివారం విరాట్ కోహ్లీ చక్కని సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు, ఐపీఎల్ 2023 సీజన్ లో అతడు మొత్తం రెండు సెంచరీలు సాధించాడు. ఈ సీజన్ లో 639 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 7 సెంచరీలతో అత్యధిక సెంచరీల వీరుడిగానూ రికార్డు నమోదు చేశాడు. తనను విమర్శిస్తున్న వారి నోళ్లు మూయించేందుకా అన్నట్టు విరాట్ కోహ్లీ ఈ రికార్డులను ఆయుధాలుగా మలుచుకున్నాడు.
‘‘గొప్పగా భావిస్తున్నాను. నా 20 క్రికెట్ పని అయిపోతోందని చాలా మంది భావిస్తున్నారు. కానీ, నేను ఎంత మాత్రం అలా అనుకోవడం లేదు. నా వరకు నేను అత్యుత్తమ టీ20 క్రికెట్ ను మరోసారి ఆడాననే అనుకుంటున్నా. నా ఆటను నేను ఆస్వాదిస్తున్నాను. టీ20 క్రికెట్ ను నేను ఇలానే ఆడతాను. అంతరాలను పూడ్చడానికి ప్రయత్నిస్తాను. ఎన్నో బౌండరీలు బాదుతూ.. చివర్లో పరిస్థితులు అనుకూలిస్తే సిక్సర్లు సాధించే ప్రయత్నం చేస్తా. పరిస్థితులను అధ్యయనం చేస్తూ సందర్భానికి అనుగుణంగా పరుగులు రాబట్టాలి. నేను బ్యాటింగ్ చేసిన తీరుతో పాటు, ఆటలో నేను నా పాత్రను బాగానే నిర్వహించాను’’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. టీ20ల్లో కోహ్లీ సత్తా అయిపోందన్న విమర్శలకు తన సమాధానం ఇదేనన్నట్టు సందేశం పంపించాడు.