RBI: రూ.వెయ్యి నోట్లు మళ్లీ వస్తాయా?.. ఆర్ బీఐ గవర్నర్ సమాధానమిదే!

Are rs 1000 Notes Coming Back answers RBI Governor

  • రూ.వెయ్యి నోట్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌న్న శక్తికాంత దాస్
  • తమ వ‌ద్ద అలాంటి ప్ర‌తిపాద‌నేదీ లేదని వెల్లడి
  • రూ.2 వేల నోట్ల విత్ డ్రా వల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెద్దగా ప్ర‌భావం ఉండదని వ్యాఖ్య

2016లో రూ.వెయ్యి, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.వెయ్యి నోటు స్థానంలో కొత్తగా రూ.2 వేల నోటును తీసుకురాగా, పాత రూ.500 నోటు స్థానంలో కొత్తది ప్రవేశపెట్టింది. రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రెండు రోజుల కిందట ఆర్బీఐ ప్రకటించింది. దీంతో రూ.2 వేల నోటు స్థానంలో రూ.వెయ్యి నోటును మళ్లీ తీసుకొస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు. వెయ్యి రూపాయల నోట్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని స్పష్టం చేశారు. 2 వేల నోట్ల‌ను విత్ డ్రా చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావాన్ని త‌ట్టుకునేందుకు రూ.వెయ్యి నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతారా? అని మీడియా ప్రశ్నించింది. ఆయన బదులిస్తూ.. ‘‘రూ.1000 నోటును మళ్లీ తీసుకోచ్చే ఆలోచ‌న లేదు. అది ఊహాజ‌నితమే. మా వ‌ద్ద అలాంటి ప్ర‌తిపాద‌నేదీ లేదు’’ అని వివరించారు. 

ప్ర‌స్తుతం స‌ర్క్యులేష‌న్‌లో ఉన్న క‌రెన్సీలో.. కేవ‌లం 10.8 శాతం మాత్ర‌మే రూ.2 వేల నోట్లు ఉన్నాయని శక్తికాంతదాస్ వివరించారు. ఆ నోట్ల‌ను విత్‌డ్రా చేయ‌డం వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై అతి స్వ‌ల్ప స్థాయిలోనే ప్ర‌భావం ఉంటుంద‌ని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News