Ram Charan: మన గొప్పదనాన్ని తెలియజేసే అవకాశం రావటం నా అదృష్టం: రామ్ చరణ్
- శ్రీనగర్ లో జీ-20 సదస్సు
- భారతీయ సినీ రంగ ప్రతినిధిగా హాజరైన రామ్ చరణ్
- సినీ రంగంలో తన అనుభవాలను వేదికపై పంచుకున్న వైనం
- భారతీయ సినిమాలు విలువైన జీవిత పాఠాలు అని వెల్లడి
ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. శ్రీనగర్‌లో జరుగుతున్న జీ-20 సమ్మిట్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కు భారత సినీ పరిశ్రమ తరపున ఆయన ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన సినీ రంగంలో స్వీయ అనుభవాలను వివరించారు.
అంతే కాకుండా ప్రపంచంలో సినీ చిత్రీకరణకు సంబంధించిన ప్రాంతాల్లో మన దేశం యొక్క సామర్థ్యం గురించి ఆయన గొప్పగా తెలియజేశారు. భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా ప్రభావం, అత్యాధునిక సాంకేతికతతో పాటు ఇది చలన చిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎలా మారిందనే విషయాలను చరణ్ విడమర్చి చెప్పారు. ఫిల్మ్ టూరిజం అంశాన్ని ప్రస్తావిస్తూ, జీ-20 సభ్య దేశాలు మన దేశంలో చురుకైన భాగస్వామ్యం వహించాలని తెలిపారు.
‘‘ఎన్నో ఏళ్లుగా గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మికతలతో మిళితమైన మన గొప్పదనాన్ని సినీ రంగం తరఫున తెలియజేసే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కంటెంట్‌ను ఎంతో విలువైన జీవిత పాఠాలుగా అందించే గొప్పదనం మన ఇండియన్ సినిమాల్లో ఉన్నాయి’’ అని వివరించారు.
రామ్ చరణ్ అద్భుతంగా చెప్పారు: కిషన్ రెడ్డి
ఈ సదస్సుకు హాజరైన సంస్కృతి, అభివృద్ధి మరియు టూరిజం మినిష్టర్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘రామ్ చరణ్ అద్భుతంగా తను చెప్పాలనుకున్న విషయాలను వివరించారు. ఆయన తన వినయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఈ జీ-20 సమ్మిట్‌కు ఇండియన్ సినీ ఇండస్ట్రీ తరపున చరణ్‌గారు ప్రతినిధిగా రావటం గర్వంగా ఉంది.
వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ-పర్యాటక రంగం పట్ల అతని అంకితభావం మన దేశ సహజ సౌందర్యాన్ని సంరక్షించడానికి, గొప్పగా ప్రదర్శించడానికి యువతను ప్రోత్సహించటమే కాకుండా వారికి శక్తిమంతమైన ప్రేరణగా నిలుస్తుంది’’ అని అన్నారు.