Chinta mohan: రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి బదులు.. చిరంజీవి ముఖ్యమంత్రి కావల్సింది..: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
- చిరంజీవికి రాజకీయం తెలియదన్న చింతా మోహన్
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోమయంలో పడిపోయారని వ్యాఖ్య
- రెండు సామాజిక వర్గాలు 75 ఏళ్లుగా ఏపీని దోచుకుంటున్నాయని ఆరోపణ
- జగన్ పని అయిపోయిందని, ఆయన మళ్లీ అధికారంలోకి రారని వ్యాఖ్య
జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగం పెరిగిపోయిందని మండిపడ్డారు. రెండు సామాజిక వర్గాలు 70, 75 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఏపీలో ఫ్యాన్, సైకిల్ పరిస్థితి చూసి జనం నవ్వుతున్నారన్నారు. ‘‘జగన్ మళ్లీ అధికారంలోకి రారు. రాలేరు. ఆయన పని అయిపోయింది’’ అని అన్నారు.
2024లో ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 120 స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చిరంజీవిలా అయోమయంలో పడిపోయారని చింతా మోహన్ అన్నారు. ‘‘చిరంజీవికి రాజకీయం తెలియదు. అసలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి ముఖ్యమంత్రి కావలసిన వారు. అయితే రాజకీయ అనుభవం లేక ముఖ్యమంత్రి కాలేదు. నాకు చిరంజీవి మంచి మిత్రుడు’’ అని తెలిపారు. పార్టీ వీడిన వారిని వెనక్కి పిలవనని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు బాగోలేవని, పేదలు పేదలుగానే ఉంటున్నారని అన్నారు. పార్లమెంట్ భవనాన్ని మార్చాల్సిన అవసరం లేకపోయినా మారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి చేయాల్సిన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ చేస్తున్నారని అన్నారు.