Varla Ramaiah: స్థానిక పోలీసులు సీబీఐని బెదిరించారని చెబితే గవర్నర్ ఆశ్చర్యపోయారు: వర్ల రామయ్య
- అవినాశ్ రెడ్డి వ్యవహారంలో గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు
- అవినాశ్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటన్న వర్ల
- ఏపీలో సీబీఐ పరిస్థితి దయనీయం అని వ్యాఖ్య
ఈ సాయంత్రం టీడీపీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమ తదితరులు రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి అవినాశ్ రెడ్డి వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. అవినాశ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. ఎవరో ఆకు రౌడీలు వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదని బెదిరిస్తే అరెస్ట్ చేయకుండా వెనక్కి వచ్చేస్తారా? అని నిలదీశారు.
"రాష్ట్రంలో టీచర్లు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే వాళ్లను నియంత్రించారు. టీడీపీ నేతలు రోడ్డు మీదికి వస్తే కంట్రోల్ చేశారు. కమ్యూనిస్టులు, ఇతర విపక్ష నేతలు రోడ్ల మీదికి రాకుండా గృహ నిర్బంధాలు చేశారు కదా. అవినాశ్ రెడ్డి కాన్వాయ్ వందలాంది వాహనాలతో ఊరేగింపుగా వస్తుంటే ఏం చేస్తున్నారు?
వీటన్నింటిపై ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించాం. ఇవన్నీ చూశాక ఆయన ఆశ్చర్యపోయారు. నిజమా? అని అడిగారు. నిజమే సార్ అని చెప్పాం... కావాలంటే వాళ్ల మీడియా కరపత్రం, వాళ్ల టీవీ చానల్ తప్ప మిగతా చానళ్లు చూడాలని చెప్పాం.
ఏపీలో సీబీఐ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. ఎక్కడైనా సీబీఐ వస్తే స్థానిక పోలీసులు భయపడతారు. కానీ జగన్ పాలనలో స్థానిక పోలీసులే సీబీఐ వాళ్లను బెదిరిస్తున్నారు. లోకల్ పోలీసులే దర్యాప్తు అధికారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం... సీబీఐ పరిస్థితి ఇంత దయనీయంగా ఏపీలోనే ఉందా, లేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందా?
పశ్చిమ బెంగాల్ లో మంత్రులను అరెస్ట్ చేసినప్పుడు సీబీఐ బాగానే పనిచేసిందే! ఢిల్లీలో డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసేటప్పుడు ఒక కార్లో వెళ్లి లాక్కుని వచ్చారే! గతంలో టెలికాం మంత్రిగా ఉన్న రాజాను నలుగురెళ్లి లాక్కొచ్చారే... నిన్నగాక మొన్న కర్ణాటకలో ఓ మంత్రిని లాక్కొచ్చారే... మరి ఏపీలో ఎందుకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు?" అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
అనంతరం బొండా ఉమ మాట్లాడారు. 2019లో జరిగిన జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎన్నో మలుపులు తిరుగుతోందని అన్నారు. గూగుల్ టేకౌట్ వంటి అధునాతన టెక్నాలజీతో వెల్లడైన వాస్తవాలతో ప్రపంచం నివ్వెరపోయిందని అన్నారు.
"వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి సాక్ష్యాలు చెరిపివేసినట్టు సీబీఐ తేల్చింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఎక్కడా బెయిల్ లభించలేదు. ఈ కేసులో అవినాశ్ వందల కోట్లు ఖర్చు చేశాడు. అతడికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సీబీఐ ఇటీవల నోటీసులు ఇస్తే తల్లిని అడ్డంపెట్టుకుని దొంగ నాటకానికి తెరదీశాడు. ఇదంతా తాడేపల్లి ఆదేశాల మేరకు జరుగుతున్న డ్రామా.
ఒక హత్య కేసులో ముద్దాయిని కాపాడేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్న విషయం గవర్నర్ కు వివరించాం. ఎక్కడైనా అవినీతిపరులు, నేరస్తులు, స్కాంలు చేసినవారు, రాజకీయనేతలు సీబీఐని చూసి భయపడతారు... కానీ రాష్ట్రంలో వైసీపీని చూసి సీబీఐ భయపడే పరిస్థితి ఏర్పడింది. నిన్న జరిగిన పరిణామాలతో సీబీఐ అధికారులు 8 గంటల పాటు ఎస్పీ ఆఫీసులోనే కూర్చుండి పోవాల్సి వచ్చింది. సీబీఐ అధికారులకు ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు?
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన రౌడీలు కర్నూలులో విచ్చలవిడిగా తిరిగారు.... మీడియా వాళ్లను కూడా కొట్టారు... కెమెరాలు ధ్వంసం చేసి చానళ్ల ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేశారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసేందుకు వస్తే వారికి కనీస భద్రత ఇవ్వలేకపోయారు" అంటూ బొండా ఉమ నిప్పులు చెరిగారు.