Karnataka: ఐదేళ్లూ ఆయనే సీఎం.. కర్ణాటక పవర్ షేరింగ్‌పై మంత్రి పాటిల్ కీలక వ్యాఖ్యలు
- డీకే వర్గంలో కలకలం రేపిన పాటిల్
- ఆ వ్యాఖ్యలను పట్టించుకోబోనన్న డీకే
- ఆ విషయాలు చూసుకునేందుకు ఖర్గే ఉన్నారని వ్యాఖ్య
కర్ణాటక పవర్ షేరింగ్‌పై మంత్రి ఎంబీ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లూ సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. కర్ణాటక అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిపై ఎడతెగని చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నడిచింది. రెండున్నరేళ్ల చొప్పున ఇద్దరి మధ్య అధికార పంపిణీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది.
చివరికి అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. డీకే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చివరి రెండున్నరేళ్లు డీకే సీఎంగా బాధ్యతలు చేపడతారన్న ప్రచారం ఉంది. అయితే, ఇప్పుడు పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలు డీకే వర్గంలో కలకలం రేపాయి.
పాటిల్ గత రాత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. అధికార పంపిణీపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాను పట్టించుకోబోనని, ఈ విషయమై తానేమీ మాట్లాడదలచుకోలేదని అన్నారు. అధికార పంపిణీ సహా ఇతర విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలకు తాము ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రాభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఇదే విషయమై ఎంపీ, డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ మాట్లాడుతూ.. అది ఏఐసీసీ స్థాయిలో చర్చించే అంశమని అన్నారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు గురువారం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లనున్నారు.