NDTV: రాహుల్ గాంధీ పాప్యులారిటీ పెరిగిందా? మోదీ ఆధిపత్యం కొనసాగుతోందా?: ఎన్డీటీవీ - లోక్ నీతి సెంటర్ సర్వేలో సంచలన విషయాలు

NDTV survey on popularity of Modi and Rahul Gandhi

  • ఇప్పటికీ తిరుగులేని నేతగా నరేంద్ర మోదీ
  • భారత్ జోడో యాత్ర తర్వాత పెరిగిన రాహుల్ గాంధీ పాప్యులారిటీ
  • కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే 19 రాష్ట్రాల్లో సర్వే

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన సుదీర్ఘ భారత్ జోడో యాత్ర తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విజయం బీజేపీ ఆధిపత్యాన్ని ఎలాగైనా నిలువరించాలని భావిస్తున్న విపక్షాలకు ఊపిరి పోసినట్టయింది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికలపై పడింది. ఈ తరుణంలో లోక్ నీతి సెంటర్ తో కలిసి జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ఒక పబ్లిక్ ఒపీనియన్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

ఈ సర్వేను మే 10 నుంచి 19వ తేదీ వరకు 19 రాష్ట్రాల్లో నిర్వహించారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వేను చేపట్టారు. కర్ణాటకలో బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురైనప్పటికీ... జాతీయ స్థాయిలో మోదీ పాప్యులారిటీ ఏమాత్రం చెక్కుచెదరలేదని సర్వేలో తేలింది. 43 శాతం మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకే ఓటు వేస్తామని 40 శాతం మంది చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కు ఓటు వేస్తామని 29 శాతం మంది వెల్లడించారు. 

2019లో బీజేపీ ఓట్ షేర్ 37 శాతంగా ఉండగా... అది ఇప్పుడు 39 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా భారీగా పుంజుకుంది. 2019లో కాంగ్రెస్ ఓట్ షేర్ 19 శాతంగా ఉండగా... అది ఇప్పుడు 29 శాతానికి పెరిగింది. 

ప్రధాన మంత్రిగా టాప్ ఛాయిస్ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా... 43 శాతం మంది మోదీ అని చెప్పగా... 27 శాతం మంది రాహుల్ వైపు మొగ్గు చూపారు. దేశంలోని ఏ ఇతర నేత కూడా పీఎం ఛాయిస్ లో దరిదాపుల్లో కూడా లేరు. మమతా బెనర్జీకి 4 శాతం మంది, కేజ్రీవాల్ కు 3 శాతం మంది, నితీశ్ కుమార్ కు 1 శాతం మంది మాత్రమే జై కొట్టారు. 

2019 ఎన్నికల సమయంతో పోలిస్తే... ప్రస్తుతం మోదీ పాప్యులారిటీ 44 శాతం నుంచి 43 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో రాహుల్ పాప్యులారిటీ 24 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. మన దేశంలో ఇప్పటికీ అత్యంత పాప్యులారిటీ కలిగిన నేతగా మోదీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 

2024 ఎన్నికల్లో మోదీని ఛాలెంజ్ చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు ఎవరనే ప్రశ్నకు బదులుగా... ఆ సత్తా రాహుల్ కు మాత్రమే ఉందని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు. 11 శాతం మంది కేజ్రీవాల్, 5 శాతం మంది అఖిలేశ్ యాదవ్, 4 శాతం మంది మమతా బెనర్జీ పేరు చెప్పారు. మోదీని ఢీకొట్టే నాయకుడే లేరని 9 శాతం మంది సమాధానమిచ్చారు. 

రాహుల్ గాంధీని తాము ఎప్పటికీ అభిమానిస్తామని 26 శాతం మంది చెప్పగా... భారత్ జోడో యాత్ర తర్వాత నుంచి ఆయనను అభిమానించడం మొదలు పెట్టామని 15 శాతం మంది చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నామని 55 శాతం మంది చెప్పగా... పూర్తి సంతృప్తిగా ఉన్నామని 17 శాతం మంది చెప్పారు. పూర్తి అసంతృప్తిగా ఉన్నామని 21 శాతం మంది స్పష్టం చేశారు. 

సీబీఐ, ఈడీ పనితీరు పట్ల కూడా ప్రజలు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు. ఈ కేంద్ర సంస్థలు చట్టానికి లోబడి పని చేస్తున్నాయని 32 శాతం మంది చెప్పగా... రాజకీయ కక్ష సాధింపుల కోసం వీటిని ఉపయోగించుకుంటున్నారని 32 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News