Etala Rajender: ఏనాడూ పదవులు కావాలని అడగలేదు.. ఇకముందు కూడా అడగను: ఈటల
- తన సేవలను ఎక్కడ ఉపయోగించుకోవాలన్నది పార్టీ నిర్ణయిస్తుందన్న ఈటల
- బీజేపీలో పాత, కొత్త తేడాలు లేవని నడ్డా, అమిత్ షా చెప్పారని వివరణ
- పార్టీలో చేరే నేతల అనుభవాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటామన్న ఈటల
ఓ పార్టీలో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేసిన నేత మరో కొత్త పార్టీలో చేరినపుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొత్త, పాత నేతలంటూ కొంతకాలం తేడాలు కొనసాగుతాయని, ఏ పార్టీలో అయినా సరే ఇది సహజమేనని చెప్పారు. కొంతకాలం గడిచాక అంతా సర్దుకుంటుందని ఈటల వివరించారు. ఈమేరకు బుధవారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలో కొత్త పాత నేతలంటూ తేడాలు కానీ, వివక్ష కానీ లేవని స్పష్టం చేశారు.
ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు ఉన్న అనుభవాన్ని బీజేపీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలన్నదే తమ పార్టీ పెద్దల ఉద్దేశమని చెప్పారు. బీజేపీలో కొత్త, పాత అంటూ తేడాలేవీ లేవని పార్టీ పెద్దలు రాష్ట్రానికి వచ్చినపుడు స్పష్టంగా చెప్పి వెళుతున్నారని ఈటల గుర్తుచేశారు. జేపీ నడ్డా కానీ, అమిత్ షా కానీ మరో నేత కానీ ఇదే విషయం చెబుతున్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతలు తప్పకుండా తమ వ్యక్తిగత ఎదుగుదలను కూడా కోరుకుంటారని ఈటల రాజేందర్ చెప్పారు.
మండల స్థాయిలో నేతలు పార్టీ మారినప్పుడు ఎంపీపీ పదవిని ఆశించడం తప్పు కాదని, అలాగే నియోజకవర్గ స్థాయి నేతలు ఎమ్మెల్యే పదవి కోరుకుంటారని చెప్పారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ పార్టీలోనైనా ఇది సహజమేనని అన్నారు. అయితే, తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఏ పదవి కావాలని నోరు విడిచి అడగలేదని ఈటల చెప్పారు. ఇప్పటి వరకు పదవులు అడగలేదని, ఇకముందు కూడా అడగబోనని చెప్పారు. తన సేవలు ఎలా ఉపయోగించుకోవాలి, ఏ బాధ్యతలు అప్పజెప్పాలి అనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని వివరించారు.
వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని, తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. పార్టీలో చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించగా.. రాష్ట్రంలోని పలువురు నేతలను కలిసి మాట్లాడినట్లు ఈటల చెప్పారు. ఇటీవల పొంగులేటితో కూడా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాసెస్ కొనసాగుతుందని ఈటల వివరించారు.
ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు మధ్య ప్రధానమైన తేడా గురించి చెబుతూ.. ప్రాంతీయ పార్టీలకు కళ్లు, చెవులు ఉంటాయని, రాష్ట్రంలో జరిగే విషయాలను కళ్లతో చూస్తూ చెవులతో వింటూ నిర్ణయాలు తీసుకుంటుందని ఈటల రాజేందర్ చెప్పారు. అదే జాతీయ పార్టీలకు చెవులు మాత్రమే ఉంటాయని, రాష్ట్రాలలో జరిగే విషయాలను వినడమే తప్ప చూడలేదని ఎమ్మెల్యే చెప్పారు. అందుకే, తమకు ఏదైనా అవసరం ఉన్నా ఢిల్లీకి వెళతామని, ఢిల్లీ పెద్దలకు ఏదైనా అవసరం ఉండి పిలిపించుకున్నా వెళ్లాల్సి ఉంటుందని ఈటల చెప్పారు.