Asaduddin Owaisi: నూతన పార్లమెంటు భవనాన్ని స్పీకర్ ప్రారంభిస్తేనే పాల్గొంటా: ఒవైసీ
- మే 28న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం
- ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు
- పార్లమెంటుపై స్పీకర్ కు సర్వాధికారాలు ఉంటాయన్న ఒవైసీ
- పార్లమెంటు భవనాన్ని స్పీకరే ప్రారంభించాలని స్పష్టీకరణ
ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండడం తెలిసిందే. ఈ పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తుండడం పట్ల విపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. పార్లమెంటుపై స్పీకర్ కే సర్వాధికారాలు ఉంటాయని, కొత్త పార్లమెంటు భవనాన్ని స్పీకర్ ప్రారంభించాలని తెలిపారు. కొత్త పార్లమెంటును స్పీకర్ ప్రారంభిస్తేనే తాను పాల్గొంటానని ఒవైసీ స్పష్టం చేశారు.
కాగా, నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని 19 పార్టీలు తీర్మానం చేశాయి. ఈ మేరకు అన్ని పార్టీలు కలసికట్టుగా ప్రకటన చేశాయి. ప్రధాని మోదీ పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం చేస్తుండడం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడమేనని, అంతకంటే ఎక్కువగా ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని అన్ని పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి.
ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు మోదీకి కొత్త కాదని విమర్శించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్మును పూర్తిగా పక్కనబెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ఆమోదయోగ్యం కాదని విపక్షాలు పేర్కొన్నాయి.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఇవే...
1. కాంగ్రెస్
2. తృణమూల్ కాంగ్రెస్
3. డీఎంకే
4. జనతాదళ్ (యునైటెడ్)
5. ఆమ్ ఆద్మీ పార్టీ
6. ఎన్సీపీ
7. శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్)
8. సీపీఎం
9. సమాజ్ వాదీ పార్టీ
10. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)
11. సీపీఐ
12. ముస్లిం లీగ్
13. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)
14. నేషనల్ కాన్ఫరెన్స్
15. కేరళ కాంగ్రెస్ (ఎం)
16. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ)
17. మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే)
18. విడుదలై చిరుతైగళ్ కట్చి (వీసీకే)
19. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్ డీ)