Delhi tunnel: టన్నెల్ లో సిగ్నల్స్ అందక అంబులెన్స్ ఆలస్యం.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడి మృతి
- ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ లో ఘటన
- సకాలంలో చికిత్స అందితే తమ కొడుకు బతికేవాడని వాపోతున్న తల్లిదండ్రులు
- దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటన
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు సకాలంలో చికిత్స అందక కన్నుమూశాడు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ లో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ లోపల సిగ్నల్స్ అందకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ కలవలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతో అంబులెన్స్ వచ్చేసరికి ఆలస్యం జరిగిందని చెప్పారు. ఫలితంగా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే యువకుడు ప్రాణాలు కోల్పోయాడని అన్నారు.
ఢిల్లీకి చెందిన రాజన్ రాయ్ (19) యూపీలోని మీరట్ కు వెళ్లి బైక్ పై తిరిగి వస్తున్నాడు. ప్రగతి మైదాన్ టన్నెల్ లో రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. బైక్ మీది నుంచి పడడంతో హెల్మెట్ పూర్తిగా ధ్వంసమైంది. తలకు బలమైన గాయాలయ్యాయి. యాక్సిడెంట్ చూసిన వాహనాదారులు ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ చేశారు. అయితే, టన్నెల్ లో సిగ్నల్స్ సరిగా లేక కాల్ కలవలేదు, దీంతో అంబులెన్స్ రావడానికి ఆలస్యమైంది. రాజన్ ను దగ్గర్లోని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీకి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గతేడాది ఈ టన్నెల్ ను ప్రారంభించింది. సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ లో స్మార్ట్ ఫైర్ మేనేజ్ మెంట్, డిజిటల్ గా నియంత్రించే సీసీటీవీ కెమెరా వ్యవస్థతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది. అయితే, టన్నెల్ లో సిగ్నల్స్ సరిగా బాగుంటే సమయానికి అంబులెన్స్ వచ్చేదని, సకాలంలో చికిత్స అంది తమ కొడుకు తమకు దక్కేవాడని రాజన్ తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు.