Satyendar Jain: తీహార్ జైలు వాష్‌రూములో కుప్పకూలిన సత్యేంద్రజైన్
- తెల్లవారుజామున 6 గంటల సమయంలో స్పృహతప్పి పడిపోయిన జైన్
- దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలింపు
- జైన్ ఆసుపత్రిలో చేరడం వారం రోజుల్లో ఇది రెండోసారి
మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. తీహార్ జైలులో ఉన్న ఆయన వాష్ రూములో ఈ తెల్లవారుజామున 6 గంటల సమయంలో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చారు. అనారోగ్యంతో ‘ఆప్’ నేత ఆసుపత్రిలో చేరడం వారం రోజుల్లో ఇది రెండోసారి.
సత్యేందర్ జైన్‌ను ఆసుపత్రికి తరలించామని, అక్కడాయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నట్టు తీహార్ జైలు డీజీ తెలిపారు. ఆయన వెన్నెముకకు కూడా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉందన్నారు. జైన్ బలహీనంగా ఉండడంతో ఆయనను అబ్జర్వేషన్లో ఉంచినట్టు మరో అధికారి తెలిపారు. కాగా, జైన్ అరెస్ట్ అయిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 35 కిలోలు తగ్గినట్టు ఆప్ వర్గాలు ఇటీవల తెలిపాయి. ఆయన బలహీనంగా బక్కచిక్కినట్టు ఉన్న ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి.