Jairam Ramesh: ఎయిర్ పోర్టులో అధికారి పట్ల మోదీ తీవ్ర అసహనం... వీడియో పంచుకున్న జైరాం రమేశ్
- ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన
- ఢిల్లీలో విమానం దిగి వస్తుండగా ఎదురొచ్చిన అధికారి
- వెనక్కి వెళ్లాలంటూ అసహనం వెలిబుచ్చిన మోదీ
- వీడియో వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే విమానం దిగి వస్తుండగా, ఓ అధికారి పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేయడం వీడియోలో రికార్డయింది.
మోదీ నడుచుకుంటూ వస్తుండగా, ఆ అధికారి నమస్కారం చేస్తూ మోదీకి సమీపానికి వెళ్లారు. దాంతో ఆగిపోయిన మోదీ... వెనక్కి వెళ్లాలని ఆ అధికారికి సూచించారు. మోదీ ఏం చెబుతున్నారో ఆ అధికారికి అర్థం కాకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. దాంతో మోదీ మరింత అసహనానికి లోనయ్యారు. బాగా వెనక్కి వెళ్లు అంటూ చేతులు ఊపుతూ సంజ్ఞలు చేశారు.
అక్కడున్న ఇతరులు ఆ అధికారిని వెనక్కి వచ్చి నిలుచోవాలని సూచించారు. ఆ వ్యక్తి వెనక్కి వచ్చి నిలుచోవడంతో, అప్పుడు మోదీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ వీడియోపై విమర్శనాత్మకంగా స్పందించారు. "కొరియోగ్రఫీకి గురువు అనదగ్గ వ్యక్తి (మోదీ) ఏం చేశాడో చూడండి" అంటూ ఆ వీడియోను రీట్వీట్ చేశారు.
ప్రతి చోటా అందరి దృష్టి తనపై ఉండేలా చూసుకోవడంలో మోదీ దిట్ట అని, తాను తప్ప ఇంకెవరూ కనిపించకూడదని భావిస్తుంటారని విపక్ష నేతలు ప్రధానిపై విమర్శలు చేస్తుండడం తెలిసిందే.