Sensex: సెన్సెక్స్ లక్ష మార్క్ నకు ఎప్పుడైనా చేరుకోవచ్చు: జెఫరీస్
- పెద్ద సమయం అక్కర్లేదన్న అభిప్రాయం
- భారత వృద్ధి అవకాశాలపై ఇన్వెస్టర్లలో సానుకూలత
- దీర్ఘకాలంలో భారత్ బుల్ ర్యాలీ కొనసాగుతుందన్న అంచనా
సెన్సెక్స్ (బోంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ) ఎప్పుడైనా లక్ష మార్క్ ను చేరుకోవచ్చని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ పేర్కొంది. ప్రస్తుతం సెన్సెక్స్ 62,486 వద్ద ఉంది. అంటే ఇక్కడి నుంచి మరో 40 శాతం పెరిగితే కానీ సెన్సెక్స్ లక్ష మార్కును చేరుకోలేదు. జెఫరీస్ ఈక్విటీస్ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వూడ్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. అస్థిరమైన పరిస్థితుల్లో సైతం భారత స్టాక్ మార్కెట్ లాభాలతో ముందడుగు వేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘సెన్సెక్స్ 1,00,000 మార్క్ ను చేరుకునేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. భారత్ దీర్ఘకాల బుల్ మార్కెట్ బాటలోనే ఉంది. అవరోధాలను అధిగమించుకుని ముందుకే సాగుతుంది. రాబోయే 12 నెలలకు సంబంధించి ఒక ఆందోళనకరమైన ప్రశ్న ఉదయిస్తోంది. మోదీ తిరిగి ఎన్నికవుతారా? అన్నదే ఈ ప్రశ్న’’ అని క్రిస్టోఫర్ వూడ్ పేర్కొన్నారు. సెన్సెక్స్ 2026 చివరికి 1,00,000 మార్క్ ను చేరుకోవచ్చని గతేడాది ఫిబ్రవరిలో క్రిస్టోఫర్ వూడ్ తన అంచనాను వ్యక్తం చేయడం గమనార్హం.
ఆసియా, వర్ధమాన దేశాల్లో భారత్ దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపిస్తుందని జెఫరీస్ అంచనా వేసింది. దీర్ఘకాలంలో వ్యాల్యూషన్లు నిదానిస్తాయని, భారత్ వృద్ధి అవకాశాల పట్ల ఇన్వెస్టర్లు నమ్మకం ప్రదర్శించొచ్చని పేర్కొంది. ‘‘భారత్ లో స్థానిక డిమాండ్ బలంగా ఉంది. ఇది ఈక్విటీ మార్కెట్ల అంచనాలకు మద్దతుగా నిలుస్తుంది. రుణాల్లో వృద్ధి కొద్దిగా నిదానించినా, ఇప్పటికీ బలంగా ఉంది’’ అంటూ తన అంచాలను వ్యక్తీకరించింది.