Pawan Kalyan: తెలుగునాట షిర్డీసాయి చరిత్ర ప్రాచుర్యం పొందడానికి కె.వాసు సినిమానే కారణం: పవన్ కల్యాణ్
- సీనియర్ దర్శకుడు కె.వాసు కన్నుమూత
- కె.వాసు మృతి వార్త తెలిసి చింతించానన్న పవన్
- కె.వాసు సినిమాతోనే చిరంజీవి వెండితెరపై తొలిసారి కనిపించినట్టు వెల్లడి
- కె.వాసు సినిమాల్లో శ్రీ షిర్డీసాయిబాబా మహత్యం ప్రత్యేకమైనదని వివరణ
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.వాసు మృతిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. దర్శకుడు కె.వాసు కన్నుమూశారని తెలిసి చింతించానని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కె.వాసు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
అన్నయ్య చిరంజీవి ముఖ్యపాత్రలో నటించిన ప్రాణం ఖరీదు సినిమా దర్శకుడిగా కె.వాసును మర్చిపోలేమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చిరంజీవి తొలిసారి వెండితెరపై కనిపించింది ఆ సినిమాతోనే అని వెల్లడించారు. కె.వాసు వినోదాత్మక చిత్రాలే కాకుండా, భావోద్వేగ అంశాలను కూడా తెరకెక్కించారని వివరించారు.
కె.వాసు సినిమాల్లో శ్రీ షిర్డీసాయిబాబా మహత్యం ప్రత్యేకమైనదని పవన్ తెలిపారు. తెలుగునాట షిర్డీసాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందడంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైందని వివరించారు.