Shubhman Gill: ఆ మిస్సయిన క్యాచ్ విలువ 129 పరుగులు... మోదీ స్టేడియంలో శుభ్ మాన్ షో
- అహ్మదాబాద్ లో ఐపీఎల్ క్వాలిఫయర్-2
- గుజరాత్ టైటాన్స్ తో ముంబయి ఇండియన్స్ అమీతుమీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- 60 బంతుల్లో 129 పరుగులు చేసిన శుభ్ మాన్ గిల్
- 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు
ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం శుభ్ మాన్ గిల్ విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలకు సాక్షిగా నిలిచింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకోగా... శుభ్ మాన్ గిల్ ప్రళయ రుద్రుడిలా బ్యాటింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఫోర్లు, సిక్సులతో ముంబయి బౌలింగ్ ను ఊచకోత కోశాడు. ఈ టోర్నీలో మూడో సెంచరీ నమోదు చేసుకున్నాడు.
గిల్ డైనమిక్స్ ఇన్నింగ్స్ సాయంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు చేసింది. గిల్ కేవలం 60 బంతుల్లోనే 129 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 7 ఫోర్లు, 10 భారీ సిక్సులు ఉన్నాయి.
వాస్తవానికి గిల్ మొదట్లోనే అవుటవ్వాల్సిన వాడు. జోర్డాన్ బౌలింగ్ లో గిల్ ఇచ్చిన క్యాచ్ ను టిమ్ డేవిడ్ జారవిడిచాడు. అది కొంచెం కష్టసాధ్యమైన క్యాచ్ అయినప్పటికీ, దాని మూల్యం ఎలాంటిదో ఆ తర్వాత సాగిన గిల్ విజృంభణ చెబుతుంది.
మొన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన ఆకాశ్ మధ్వాల్ ఈ మ్యాచ్ లో గిల్ దెబ్బకు బలయ్యాడు. తన బౌలింగ్ లో గిల్ వరుసబెట్టి ఫోర్లు, సిక్సులు కొడుతుంటే మధ్వాల్ దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చివరికి అదే మధ్వాల్ బౌలింగ్ లో టిమ్ డేవిడ్ క్యాచ్ పట్టడంతో గిల్ అవుటయ్యాడు. అప్పటికే ముంబయి ఇండియన్స్ కు కోలుకోలేనంత నష్టం జరిగిపోయింది.
ఇక గుజరాత్ ఇన్నింగ్స్ చూస్తే... ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 18, సాయి సుదర్శన్ 43 (రిటైర్డ్ అవుట్), హార్దిక్ పాండ్యా 28 (నాటౌట్) పరుగులు చేశారు.