Assam: 30 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించిన టీచర్
- నిబంధనలకు విరుద్ధంగా పొడవాటి జుట్టుతో వస్తున్న విద్యార్థులు
- ఎన్ని సార్లు మందలించినా మార్పు లేకపోవడంతో ఆగ్రహం
- జుట్టు కత్తిరించడం ద్వారా క్రమశిక్షణ చర్య తీసుకున్నట్టు వివరణ
అసోం రాష్ట్రంలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పట్ల ఓ టీచర్ అనుచితంగా ప్రవర్తించారు. పాఠాలు చెప్పాల్సిన టీచర్.. ప్రార్థనా సమయంలో 30 మంది విద్యార్థులను వరుసగా నించోబెట్టి, జుట్టు కత్తిరించిన ఘటన మజూలి జిల్లాలో వెలుగు చూసింది. దీనిపై పెద్ద దుమారం లేవడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన వివరణను పరిశీలిస్తే..
‘‘విద్యార్థులు స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా పొడవాటి జుట్టును కలిగి ఉన్నారు. దీనిపై వారిని ఎన్నో సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది. వారి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియ జేశాం. అయినా వారిలో మార్పు లేదు. కనుక క్రమశిక్షణ గురించి వారికి తెలిసేలా చేసేందుకు ఇదో విధానం’’ అంటూ స్కూల్ అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ కావేరీ బీ శర్మ ఆదేశించారు.
స్కూల్ అధికారుల ఆదేశాలనే తాను అమలు చేసినట్టు జుట్టు కత్తిరించిన టీచర్ నిక్కీ అంటున్నారు. పిల్లలు తల ముందు భాగంలో ట్రిమ్ చేసుకుని, ఏడుస్తూ ఇంటికి వచ్చినట్టు తల్లిదండ్రులు చెప్పారు. పిల్లలు తిరిగి స్కూల్ కు వెళ్లనంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లలకు క్రమశిక్షణ గురించి చెప్పేందుకు ఇతర మార్గాలున్నాయని, ఇలా చేయడం సరికాదని ఉన్నతాధికారులు కూడా అంటుండడం గమనార్హం.