Balakrishna: ఇప్పుడు మరో రకం మహానుభావులను చూస్తున్నాం: మహానాడు సభలో బాలకృష్ణ

Balakrishna speech at Mahanadu meeting

  • టీడీపీ మహానాడు సభలో బాలకృష్ణ ప్రసంగం
  • ఎన్టీఆర్ మహానుభావుడు అని వెల్లడి
  • టీడీపీకి పూర్వవైభవం ఖాయమని ధీమా
  • కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు 

అన్ని వర్గాల ప్రజలను అవస్తలపాల్జేసి అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ప్రస్తుత పాలన పోయి, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలోని మహానాడు సభలో ఆయన ప్రసంగించారు. 

ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు తెచ్చారని బాలకృష్ణ వెల్లడించారు. పేదవాడి ఆకలి తీర్చారని, అందరిలో రాజకీయ చైతన్యం తెచ్చారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని వివరించారు. అందుకే ఆయన మహానుభావుడు అయ్యాడని, మహానుభావుడు అవ్వాలంటే మహోన్నత వ్యక్తిత్వం, ఆదర్శం వంటి మంచి లక్షణాలు ఉండాలన్నారు. కానీ ఇప్పుడు వేరే రకం మహానుభావులను చూస్తున్నామని పరోక్షంగా జగన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. 

అన్ని వ్యవస్థలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, లక్షల కోట్ల భక్షణ, రావణ పాలన అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టిడ్కో ఇళ్లను లభ్డిదారులకు ఇవ్వకుండా తాత్సారం చేసారని, ఇప్పుడు కూలిపోయే దశకు తీసుకొచ్చి ఇస్తారేమో అంటూ బాలయ్య వ్యంగ్యం ప్రదర్శించారు. 

రాష్ట్రంలో పరిశ్రమలు లేవని, నిరుద్యోగం పెరిగిందని, అదే సమయంలో గంజాయి, డ్రగ్స్ లో మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారని ఆయన అన్నారు. రైల్వే జోన్ అన్నారు, ప్రత్యేక హోదా అన్నారు వాటిని ఎందుకు గాలికి వదిలేశారని ఆయన ప్రశ్నించారు. దొరికిందల్లా దోచుకుని పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే మళ్ళీ తెలుగుదేశం పూర్వవైభవం సంతరించుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని బాలకృష్ణ చెప్పారు. అందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

  • Loading...

More Telugu News