Wrestlers: కొత్త పార్లమెంట్ ముట్టడికి యత్నించిన రెజ్లర్ల అరెస్ట్.. ఛాంపియన్లపై దాడి సిగ్గుచేటన్న మమతా బెనర్జీ

Delhi police attacked wrestlers

  • రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను తొలగించాలని రెజ్లర్ల డిమాండ్
  • లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా డని ఆరోపణ
  • రెజ్లర్లకు మద్దతుగా ఉంటానన్న మమత

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ రెజ్లర్లు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో దేశానికి పతకాలను సాధించి, దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా, సంగీతా ఫొగాట్ తదితరులు ఉన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్ భూషణ్ ను తొలగించాలని కొంత కాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. అయితే, బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, వీరు కొత్త పార్లమెంటు భవనాన్ని ముట్టడించేందుకు నిన్న యత్నించారు. 

ఈ క్రమంలో వీరిని ఢిల్లీ పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాత కేసులు నమోదు చేశారు. వారిపై దాడి చేసినట్టు కూడా విజువల్స్ లో కనిపిస్తోంది. వీరంతా కూడా మనకు ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్ లలో పతకాలను సాధించిపెట్టినవారే కావడం గమనార్హం. దేశం కోసం సర్వశక్తులను ఒడ్డి పతకాలను సాధించిన వీరిపై పోలీసుల దాడి పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ దాడిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... రెజ్లర్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. మన ఛాంపియన్లపై ఇలా దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెజ్లర్లకు తాను మద్దతుగా ఉంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News