Peddireddi Ramachandra Reddy: పాత, కొత్త అబద్ధపు హామీలతో టీడీపీ మేనిఫెస్టో: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు
- 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారన్న పెద్దిరెడ్డి
- 100 పేజీల మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శ
- వైసీపీ 2 పేజీల మేనిఫెస్టోతో వచ్చి 98.44 % హామీలు నెరవేర్చిందని వ్యాఖ్య
పాత అబద్ధపు హామీలతో కొత్త అబద్ధపు హామీలు కలిపి టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో 100 పేజీలు పెట్టారని, కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి లేదని ఆరోపించారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వైసీపీ సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని చంద్రబాబు విమర్శించారని పెద్దిరెడ్డి ఆరోపించారు. వైసీపీ కేవలం రెండు పేజీల మేనిఫెస్టోతో వచ్చి 98.44 శాతం హామీలు నెరవేర్చిందని చెప్పారు. ఈ రోజు నుంచి టీడీపీ కార్యకర్తలు మేనిఫెస్టోతో ప్రజల్ని మభ్యపెట్టే పనిలో పడతారని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్ గతంలో కంటే అధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.